ఇప్పుడేం పంచులేస్తావ్ హైపర్ ఆదీ?!

జబర్దస్త్‌లో పంచె కట్టుకొచ్చి పంచులేసే హైపర్ ఆదీ ఈ మధ్య కాలంలో బాగా పాపులరైపోయాడు. అతి తక్కువకాలంలో ఎక్కువ గుర్తింపు వస్తే ఎవరి కళ్ళయినా నెత్తిమీదకి ఎక్కడం మానవమాత్రుల్లో సహజం. ఆది కూడా మానవమాత్రుడే కాబట్టి ఆయనేం మినహాయింపు కాదు. జబర్దస్త్‌కి నవ్వుల నాగబాబు ఒక జడ్జి అనే విషయం తెలిసిందే. స్కిట్ విన్నవ్వాలంటే నాగబాబు అనుగ్రహం అవసరం కూడా కమెడియన్స్‌కి వుంటుంది. అందుకో కమెడియన్లు నాగబాబు, రోజా అనుగ్రహం కోసం తపిస్తూ వుంటారు. ‘బిస్కెట్లు’ వేస్తూ వుంటారు. అలా నాగబాబుకు ఆది భారీ బిస్కెట్ వేశాడు.

 

నాగబాబు సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని మీడియా ద్వారా ఆడుకుంటున్న కత్తి మహేష్‌ని తిట్టడం ద్వారా నాగబాబు అనుగ్రహం పొందాలని ఫిక్సయ్యాడు. తన స్కిట్‌లో కత్తి మహేష్‌ని ‘సుత్తి రాజేష్’ అనే మారుపేరుతో కసిదీరా తిట్టాడు. తద్వారా నాగబాబు ఆనుగ్రహం కాస్తంత ఎక్కువగానే పొందాడు. ఈ విషయంలో కత్తి మహేష్ రియాక్ట్ అయ్యేసరికి నేను తిట్టింది నిన్ను కాదు.. ‘సుత్తి రాజేష్’ అనే మరో వ్యక్తిని అని టీవీ లైవుల సాక్షిగా ఆది తన తెలివితేటలు ప్రదర్శించాడు.  పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ హీరో పేరు చెప్పుకుని ఎంత ఓవర్ చేస్తారో అంత ఓవరూ చేశాడు. కత్తి మహేష్‌ని తిట్టి పోయడం ద్వారా ఆదికి జబర్దస్త్‌లో బాగానే వర్కవుట్ అయింది. గత కొన్ని వారాలుగా జబర్దస్త్‌లో ఆదికి పెరిగిన పాయింట్లు, గెలిచిన ఎపిసోడ్లే దీనికి నిదర్శనం. పెద్దవాళ్ళని పట్టడం ఎలాగో తెలుసుకుని, విజయవంతంగా ఇంప్లిమెంట్ చేసిన హైపర్ ఆదికి ఈ సందర్భంగా అభినందనలు.

 

ఇంతవరకూ బాగానే వుంది. పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తు్న్నాడన్న నెపంతో కత్తి మహేష్‌ని తిట్టిపోసి, పంచ్‌లు వేసిన హైపర్ ఆది ఇప్పుడు  జబర్దస్త్‌లో మరో జడ్జి రోజా మీద కూడా అలాగే పంచ్‌లు వేస్తాడా? పవన్ కళ్యాణ్‌ని కత్తి మహేష్ విమర్శించిన దానికంటే వంద రెట్లు ఎక్కువగా రోజా ఈమధ్య విమర్శించారు. రోజాకి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి మధ్య పుట్టిన నిప్పు ఇప్పుడు జ్వాలగా మారింది. ఇలాంటి దశలో హైపర్ ఆది ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటాడో చూడాలి. ఒక జడ్జిగా వున్న నాగబాబుని ఇంప్రెస్ చేయడానికి మరో జడ్జిగా వున్న రోజాని విమర్శిస్తాడా? వెటకారం పంచులేస్తాడా? కత్తి మహేష్ లాంటి సామాన్యుడు పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తే ఆదికి పౌరుషం పొడుచుకుని వచ్చింది. మరి ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్‌ని రోజా విమర్శించారు. మరి ఇప్పుడు హైపర్ ఆదికి రోషం పొడుచుకుని వస్తుందో రాదో మరి! చూద్దాం.