హైదరాబాద్ బోనాలు అదుర్స్!

 

హైదరాబాద్‌ నగరంలో ఆదివారం నాడు బోనాల ఉత్సవాలు అద్భుతంగా జరిగాయి. పాతబస్తీలోని సింహవాహిని దేవాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అలాగే ప్రభుత్వం తరఫున బంగారు బోనం అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా పలు దేవాలయాలలో అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేవాలయాల వల్ల జరిగిన ఊరేగింపులలో భాగంగా పోతరాజు నాట్య విన్యాసాలు, శివసత్తుల నాట్యం, యువత కేరింతలు, విచిత్ర వేషధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఒకవైపు బోనాలు, మరోవైపు రంజాన్ ప్రార్థనలు.. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.