TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పుప్పాలగూడలో రూ.30 వేల కోట్ల విలువైన భూమిని రక్షించిన హైడ్రా

Published on: Fri Jun 5, 2026 5:24PM

 

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైడ్రా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రకృతి సంపదను పరిరక్షించే లక్ష్యంతో చారిత్రక రాతి గుట్టలు, అత్యంత పురాతన రాతి గుహలు, వాటి మధ్య ఉన్న చెట్లు, పచ్చదనాన్ని కాపాడేందుకు హైడ్రా నడుం బిగించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని పుప్పాలగూడ–ఖాజాగూడ సరిహద్దు ప్రాంతంలో ఈరోజు శుక్రవారం 198 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా రక్షించింది. ఈ భూభా గంలో 250 కోట్ల సంవత్స రాల చరిత్ర కలిగిన రాతి గుట్టలు కూడా ఉన్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు కేటాయించిన 200 ఎకరాల భూమి కూడా ఇందులో భాగంగా ఉంది. ఈ చారిత్రక రాతి గుట్టలను సంరక్షించా లంటూ దశాబ్దాలుగా 'సొసైటీ టు సేవ్ రాక్స్' ప్రతినిధులు పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పటివరకు వారి సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో హైకోర్టును కూడా ఆశ్రయించారు. 

దాంతో రాతి గుట్టలతో పాటు ప్రభుత్వ భూములను కూడా రక్షించా లని 2019లో హైకోర్టు మున్సిపల్, రెవెన్యూ శాఖలను ఆదేశించింది. అయితే భూముల హద్దులు గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంలో జాప్యం జరగడంతో ఆక్రమణలకు అవకాశం ఏర్పడింది. దీనిపై 'సొసైటీ టు సేవ్ రాక్స్' ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను అందుకున్న వెంటనే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గతంలోనే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి హైడ్రా బృందం స్థల పరిశీలన నిర్వహించింది. భూమి ప్రభుత్వానికి చెందినదిగా నిర్ధారించుకుని ఈరోజు శుక్రవారం ఫెన్సింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ భూమి విలువ సుమారు రూ.30 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రెవెన్యూ రికార్డుల ప్రకారం...సర్వే నంబర్ 452/1లో 174 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, సర్వే నంబర్ 454/1లో 119.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మొత్తం 293.05 ఎకరాల్లో 263.05 ఎకరాలను గతంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు కేటాయించింది. రెండు గ్రామాల మధ్య ఉన్న ఓవర్‌ల్యాప్ సమస్య కారణంగా 63.05 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీంతో హెచ్‌ఎండీఏ పరిధిలో 200 ఎకరాలు మాత్రమే మిగిలాయి.ఈ చారిత్రక గుట్టల ప్రాంతంలో వివిధ దేవాలయాలకు 5 ఎకరాలు, దర్గాకు మరో 5 ఎకరాల భూమి కేటాయించినట్లు రెవెన్యూ రికార్డులు పేర్కొంటున్నాయి. మిగిలిన 200 ఎకరాల హెచ్‌ఎండీఏ భూమిని హైడ్రా శుక్రవారం రక్షణ పరిధిలోకి తీసుకువచ్చింది. 'సొసైటీ టు సేవ్ రాక్స్' ప్రతినిధులు కోరిన విధంగానే చారిత్రక రాతి గుట్టలు కూడా సంరక్షణ పొందాయి.

అత్యంత ఎత్తులో, సహజసిద్ధంగా ఏర్పడిన గుట్టలను, 250 కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన రాతి నిర్మాణాలను రక్షించడం ద్వారా ప్రకృతి వారసత్వాన్ని కాపాడిన హైడ్రా చర్యలను రాక్ సొసైటీ ప్రతినిధులు అభినందించారు. రాతి గుట్టలతో పాటు పలు ఆలయాలు ఉన్న ఈ చారిత్రక ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో హైడ్రా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, భక్తులు, పర్యావరణ ప్రేమికులు హైడ్రాకు అభినందనలు తెలిపారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం చూపడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవను ప్రశంసించారు. ఇక ఈ గుట్టల సమీపంలో ఉన్న భగీరథమ్మ చెరువును కూడా హైడ్రా పునరుద్ధరిస్తోంది. ఒకవైపు ఎత్తైన సహజ గుట్టలు, మరోవైపు భగీరథమ్మ చెరువు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం భవిష్యత్తులో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.