TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమీన్ పూర్ లో భారీ బహుళ అంతస్థుల భవనం కూల్చివేసిన హైడ్రా

Published on: Sat Apr 11, 2026 10:11AM

హైడ్రా మరో భారీ ఆపరేషన్ కు సిద్ధమైంది. ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా హైడ్రా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపురం పరిధిలోని ప్రభుత్వ స్థలంలో నిబంధనలను తుంగలో తొక్కి నిర్మించిన ఓ భారీ బహుళ అంతస్థుల భవనాన్ని శనివారం (ఏప్రిల్ 11) ఉదయం నేలమట్టం చేసింది.  అనుమతులు లేకుండా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు నిర్ధారించుకున్న హైడ్రా ఆ భవనాన్ని కూల్చివేసింది. 

ఐలాపురంలోని సర్వే నంబర్ 101లో సుమారు 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో గత కొంతకాలంగా అక్రమార్కులు పాగా వేసి నివాసాలను, బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే సుమారు 400 గజాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఒక బిల్డర్ ఆరంతస్తుల భవనాన్ని నిర్మించారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న హైడ్రా బృందం, భారీ పోలీసు బందోబస్తు నడుమ ఘటనా స్థలానికి చేరుకుని కూల్చివేతలు చేపట్టింది.  భారీ యంత్రాలను, బుల్డోజర్లతో ఈ ఎత్తైన భవనాన్ని కూల్చివేశారు.  అక్రమ నిర్మాణంపై గతంలోనే నోటీసులు ఇచ్చినా, స్పందన లేకపోవడంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. భవన యజమానులు తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు   ప్రాథమిక విచారణలో తేలింది.

అమీన్‌పూర్ పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు,  ప్రభుత్వ భూముల ఆక్రమణలు పెరిగిపోతు న్నాయని స్థానికుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ఐలాపురం గ్రామంలోని ప్రభుత్వ భూముల్లో ఇప్పటికే అనేక అక్రమ లేఅవుట్లు వెలిశాయని, వాటన్నింటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తి లేదని హైడ్రా స్పష్టం చేస్తోంది. రాబోయే రోజుల్లో అమీన్‌పూర్, పటాన్‌చెరు పరిసరాల్లో మరిన్ని కూల్చివేతలు ఉంటాయని సమాచారం. ముఖ్యంగా ఎఫ్.టి.ఎల్ , బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలపై హైడ్రా దృష్టి సారించింది.