TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను త్వరగా బదిలీ చేయండి : హైకోర్టు

Published on: Fri Jul 31, 2026 5:54PM

 

కోర్టు ఆదేశాలను ఉద్దేశపూ ర్వకంగా ఉల్లంఘించిన వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌ను  ఆ పదవి నుంచి విముక్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. వీలైనంత త్వరగా ప్రత్యామ్నాయ అధికారిని నియమించి ప్రస్తుత కమిషనర్‌ను బాధ్యతల నుంచి తప్పించాలని స్పష్టం చేసింది. లోతుకుంట గ్రామం, మల్కాజ్‌గిరి మండలం, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోని సర్వే నంబర్లు 1, 2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమికి సంబంధించిన కాంటెంప్ట్ కేసులు 3482, 3483/2026పై జూలై 27న హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

పిటిషనర్ భూమిలోకి జూలై 17, 18 తేదీల్లో హైడ్రా అధికారులు, పోలీసులు, యంత్రాలతో ప్రవేశించి తాత్కాలిక నిర్మాణాలు, కాంపౌండ్ వాల్, బ్లూ టిన్ షీట్లను తొలగించి ఫెన్సింగ్‌కు ప్రయత్నించారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఇదే భూమిలోకి హైడ్రా అధికారులు ప్రవేశించరాదని గతంలో కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. W.P. No.5049/2016లో 2021 మార్చి 8న హైకోర్టు భూమి ఆక్రమణ చట్టం కింద చేపట్టిన చర్యలను కొట్టివేసి, పిటిషనర్‌కు పొజెషన్ పునరుద్ధరించాలని ఆదేశించింది. 

సివిల్ కోర్టు డిక్రీ లేకుండా రాష్ట్రం జోక్యం చేసుకోరాదని కూడా స్పష్టం చేసినట్లు కోర్టు రికార్డుల్లో ఉంది. అనంతరం రాష్ట్రం దాఖలు చేసిన O.S. No.55/2021ను లిమిటేషన్ కారణంగా తిరస్కరించగా, దానిపై దాఖలైన అప్పీల్‌ను కూడా 2025 అక్టోబర్ 7న డివిజన్ బెంచ్ కొట్టివేసింది.ఈ నేపథ్యం లో హైడ్రా అధికారులు భూమిలోకి ప్రవేశించిన అంశంపై గతంలో దాఖలైన కాంటెంప్ట్ కేసుల్లో 2026 జూన్ 10న ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్ అండర్‌టేకింగ్ ఇచ్చారు. హైడ్రా అధికారులు, సిబ్బంది పిటిషనర్ భూమిలోకి ప్రవేశించరాదని కోర్టు ఆదేశాలు జారీ చేసి ఆ కేసులను ముగించింది.

అయినా జూలై 17, 18 తేదీల్లో అధికారులు మళ్లీ భూమిలోకి ప్రవేశించి, అది ప్రభుత్వ భూమి (GLR) అంటూ ఫెన్సింగ్‌కు ప్రయత్నించారని పిటిషనర్ ఆరోపించారు. ఈ చర్యకు ముందు తనకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, రెవెన్యూ శాఖ నుంచి కూడా ఎలాంటి ఆధారాలు సమర్పించ లేదని వాదించారు. ఈ వ్యవహారంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.హైడ్రా కమిషనర్ దాఖలు చేసిన అఫిడవిట్లు కూడా స్పష్టంగా లేవని పేర్కొంది. మొదటి అఫిడవిట్‌లో క్షమాపణ చెప్పలేదని, కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత దాఖలు చేసిన రెండో అఫిడవిట్‌లో క్షమాపణ చెప్పారని గమనించిన కోర్టు.. ఆ క్షమాపణను అంగీకరించలేదు.

రాష్ట్రంలోని వివిధ శాఖలు ఒకే ప్రభుత్వ వ్యవస్థలోని అవయవాల వంటివని, వాటి మధ్య సమన్వయం ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. HYDRAA చట్టం కంటే పైస్థాయిలో లేదని తేల్చిచెప్పింది. సంబంధిత కాంటెంప్నర్ ఇప్పటికే 62 కాంటెంప్ట్ కేసుల్లో పార్టీగా ఉన్న విషయాన్ని కూడా కోర్టు గమనించింది. కోర్టు ఆదేశాల ఉల్లంఘన న్యాయపాలనకు విఘాతం కలిగించిందని, కోర్టుల గౌరవాన్ని, చట్ట పాలన సూత్రాలను దెబ్బతీసే విధంగా ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “చట్ట పాలనే గెలవాలి.. వ్యక్తుల పాలన కాదు. వ్యక్తుల పాలన గెలిస్తే అది ప్రజాస్వామ్యానికి మరణ ఘంటిక” అని వ్యాఖ్యానించింది. 

అలాగే “చట్ట పాలనపై వ్యక్తుల పాలన గెలవాలని ప్రయత్నించిన క్లాసిక్ కేసు ఇది. నిజమైన ప్రజాస్వామ్యంలో ఇది కలగానే మిగిలిపోవాలి” అని స్పష్టం చేసింది. అయితే కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ చట్టం కింద జైలు శిక్ష లేదా జరిమానా విధించకుండా, “న్యాయ మహత్తు శిక్షించడంలో కాదు.. క్షమించడంలో ఉంది” అనే సూత్రాన్ని అనుసరించింది. అదే సమయంలో హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌ను పదవి నుంచి విముక్తి చేయాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. వీలైనంత త్వరగా ప్రత్యామ్నాయ అధికారిని నియమించాలని స్పష్టం చేసింది. కాంటెంప్ట్ కేసులను ఈ ఆదేశాలతో ముగించిన హైకోర్టు.. ఎలాంటి ఖర్చులు విధించలేదు. ఉత్తర్వుల ప్రతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

Hydra Commissioner Ranganath, Telangana High Court, Supreme Court, Shanthashriram Construction, CM Revanth reddy