TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయవాడ-హైదరాబాద్ రహదారి పనుల్లో మరింత జాప్యం

Published on: Fri Mar 16, 2012 5:22PM

విజయవాడ -హైదరాబాద్ రహదారిలో నిర్మిస్తున్న నాలుగు లైన్ల రహదారి పనులు మరింత జాప్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రహదారి నిర్మాణ కాంట్రాక్టును పొందిన జిఎంఆర్ సంస్థకు గుజరాత్ లో పెద్ద కాంట్రాక్టు దక్కడంతో ఇక్కడి మిషన్లను, సిబ్బందిని అక్కడికి తరలిస్తోంది. దీంతో పనులువేగం మందగించింది. చౌటుప్పల్ మండలం, మల్కాపురం నుంచి కృష్ణాజిల్లా నందిగామ వరకూ 181 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించవలసి ఉంది. దీని నిర్మాణానికి సుమార్ 1740 కోట్ల రూపాయలు ఖర్చువుతుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై ఇప్పటికే అనేక వందలమంది మరణించారు.

 

జిఎంఆర్ సంస్థ ఈ రహదారిని ఒకటిన్నర సంవత్సరాల్లో నిర్మిస్తానని చెప్పినప్పటికీ రెండేళ్ళు అవుతున్నా పనులు ఇంకా పూర్తికాలేదు. చౌటుప్పల్, చిట్యాల కేంద్రాల్లో జంక్షన్ పనులు, కొయ్యలగూడెంలో అండర్ పాస్ బ్రిడ్జి పనులు, నార్కట్ పల్లి, నకిరేకల్, కొదాడల్లో బైపాస్ పనులు చాలా మందకొడిగా సాగుతున్నాయి. దీనికి తోడు చౌటుప్పల్ పట్టణంలో ప్రభుత్వ భూముల్లో ఇళ్ళ నిర్మాణాలు, కొయ్యలగూడెం వక్ఫ్ బోర్డు భూముల సేకరణ ఇంకా పూర్తికాలేదు. దీనితో నాలుగులైన్ల రహదారి నిర్మాణం పూర్తికావడానికి మరొ ఐదారు నెలలు పట్టవచ్చునని భావిస్తున్నారు. అయితే జూలైకల్లా ఈ పనులు పూర్తిచేస్తామని చెబుతున్న జిఎంఆర్ సంస్థ ఆ నెలనుంచి ఈ రహదారిపై టోల్ టాక్స్ వసూలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.