TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తీవ్రవాదాన్ని టీ సర్కార్‌ లైట్‌గా తీసుకుంటోందా?

Published on: Tue Dec 29, 2015 9:30AM



తీవ్రవాదం అనేది మన దేశాన్ని మాత్రమే కాదు.. ప్రపంచాన్ని మొత్తం భయపెడుతున్న సమస్య. ఈ విషయంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా వుండి తీవ్రవాదానికి వ్యతిరేకంగా సమైక్య పోరాటాన్ని చేస్తున్నాయి. ఇండియా కూడా తీవ్రవాదం మీద పోరాటాన్ని ఇటీవలి కాలంలో ఉద్ధృతం చేసింది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాలంలో తీవ్రవాదాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని తీవ్రవాద దాడులు దేశంలో సంభవించాయి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశంలో తీవ్రవాద కార్యకలాపాలను కట్టడి చేసే విషయంలో సమర్థంగా వ్యవహరిస్తోంది. కేంద్రం ఎంత సమర్థంగా వున్నప్పటికీ, రాష్ట్రాలు కూడా కేంద్రానికి ఈ విషయంలో సహకరించాల్సి వుంది. రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తీవ్రవాదం విషయంలో కట్టుదిట్టంగా వ్యవహరించాల్సి వుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం తీవ్రవాదం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించడం లేదని, తీవ్రవాదాన్ని చాలా లైట్‌గా తీసుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి.

దేశంలో ఎక్కడ తీవ్రవాద కార్యకలాపాలు జరిగినా తీగలాగితే డొంక కదిలినట్టు హైదరాబా‌లో కూడా వాటికి సంబంధించి మూలాలు దొరుకుతున్నాయి. లుంబినీ పార్క్, గోకుల్ ఛాట్, దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ళ వంటి తీవ్రవాద ఘటనలు ఇప్పటికే హైదరాబాద్‌ గుండెకు గాయాన్ని చేశాయి. హైదరాబాద్ నగరం తీవ్రవాదులకు విడిదిగా మారిందన్న అభిప్రాయాలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్రవాదం విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వుంది. అయితే అలాంటి దాఖలాలేవీ కనిపించడం లేదని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐసీస్ ఉగ్రవాదుల్లో చేరడానికి హైదరాబాద్ నుంచి అనేకమంది వెళ్తూ వుండటాన్ని వారు ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. నగరంలో ఐసీస్ కార్యకలాపాలను పరిశోధించడానికి సరైన యంత్రాంగం లేదని, సోషల్ మీడియా మీద నిఘా కొరవడిందని, తీవ్రవాదుల కాల్పుల్లో పోలీసులు చనిపోతే పరామర్శించని ఒక పార్టీ నాయకులు ఒక తీవ్రవాది చనిపోతే మాత్రం అతని అంత్యక్రియల్లో పాల్గొనడం దారుణమని, ఇలాంటి విషయాల మీద ప్రభుత్వం ఎంతమాత్రం స్పందించలేదని బీజేపీ నాయకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం తీవ్రవాదం విషయంలో మరింత అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుందన్నది మాత్రం వాస్తవం అని పరిశీలకులు అంటున్నారు.