TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మిసెస్ శ్రీనివాస్ కూచిభోట్ల ఇప్పుడు ఏం చేయబోతున్నారు?

Published on: Thu Mar 2, 2017 10:38AM

 

శ్రీనివాస్ కూచిభోట్ల... కొన్ని రోజుల క్రితం అమాంతం టీవీ తెరల మీద బ్రేకింగ్ న్యూస్ గా కనిపించిన పేరు! నిజానికి అమెరికాలోని లక్షలాది మంది ఇండియన్స్ లో ఆయనొకరు. మనకు తెలిసే అవకాశమే వుండేది కాదు. కాని, విషాదంగా ఆయనొక ఉన్మాది బుల్లెట్ కి బలై అందరి నోళ్లలో నానారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా ఫస్ట్ అన్న నినాదం మార్మోగింది. ఒక విధంగా అది కూడా శ్రీనివాస్ అర్ధాంతర నిష్క్రమణకి కారణం. కాకపోతే, ఇప్పుడాయన అంత్యక్రియలు పూర్తైపోయాయి. ఇక మిగిలింది బతుకును భారంగా మోయాల్సిన ఆయన భార్య జీవితం! ఆమె ఏం చేయబోతున్నారు?

 

శ్రీనివాస్ కూచిభోట్ల లాగే ఆయన భార్య సునయన కూడా టెక్కీ. సాఫ్ట్ వేర్ పరిజ్ఞానం వున్న ఆమె అమెరికాలోనే ఒక కంపెనీలో ఉద్యోగానికి చేరారు. కాని, దురదృష్టవశాత్తూ కాన్సాస్ లో జరిగిన కాల్పుల్లో శ్రీనివాస్ ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోయారు. ఆయన చనిపోయిన అనంతరం తాను ఇండియాకి వచ్చేస్తానని అమెరికాలో చెప్పిన సునయన తాజాగా తన ఫేస్బుక్ పోస్ట్ లో అంతరంగం బయటపెట్టారు. తన కలల్ని ఛిద్రం చేసిన అమెరికాకి ఆమె తిరిగి వెళతానని చెప్పారు!

 

శ్రీనివాస్ భార్య సునయన తాను మళ్లీ అమెరికా వెళ్లి ఉద్యోగం కొనసాగిస్తాననీ, తన భర్త ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించిన ఇయాన్ అనే అమెరికన్ను కలిసి కృతజ్ఞతలు చెబుతానని అన్నారు. అంతే కాదు, శ్రీనివాస్ మృత్యు వాత పడిన ఆ చివరి రోజు తామిద్దరు డాక్టర్ వద్దకి వెళ్లి ప్రెగ్నెన్సీ గురించి సలహాలు తీసుకున్నామని, తనకి భర్త వల్ల ఒక సంతానం కలిగి వుంటే బావుండేదని ఆమె బాధగా, భారంగా తన భావాల్ని పంచుకున్నారు!

 

ప్రస్తుతం ఏ విధంగానూ పూడ్చలేని నష్టాన్ని అనుభవిస్తోన్న మిసెస్ శ్రీనివాస్ కూచిభోట్ల తిరిగి అమెరికా వెళ్లి జీవన పోరాటం ధైర్యంగా సాగించాలనుకోవటం నిజంగా గొప్ప విషయం. ఆమెని తప్పకుండా అభినందించాల్సిందే! ఏం జరిగినా, ఎలా జరిగినా జీవితపు క్రీడ సాగిపోతూనే వుండాలి కదా....