క్రికెట్ బెట్టింగులో హైదరాబాద్ పోలీసులు.. గోవాలో ఇద్దరు అరెస్ట్
Published on: Sat Oct 30, 2021 1:17PM
వాళ్లు పోలీసులు.. ఇది టీట్వంటీ సీజన్.. గల్లీగల్లీలో బెట్టింగులు కామన్. అయితే వాటిని ఆపాల్సిన పోలీసులే బెట్టింగుల్లో మునిగితేలుతున్నారు. విధులకు డుమ్మా కొట్టి మరీ పందేళ్లు కాస్తున్నారు. ఇలా గోవాలో క్రికెట్ బెట్టింగ్ పెడుతూ ఇద్దరు హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది.
గోవా క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇద్దరు హైదరాబాద్ పోలీసులు పట్టుబడ్డారు. క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతూ ఇద్దరు పోలీసులు చిక్కారు. పట్టుబడిన వారు మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ సయ్యద్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ఇమ్రాన్‌గా గుర్తించారు. ఇమ్రాన్ తన చెల్లి పెళ్లి అంటూ లీవ్ పెట్టి గోవాలో ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. గతంలో ఇమ్రాన్ అనేక సార్లు క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇమ్రాన్ 12 ఏళ్లగా టాస్క్ ఫోర్స్‌లో డ్యూటీ చేస్తుండగా... సయ్యద్ 8 ఏళ్లగా టాస్క్ ఫోర్స్‌లో పనిచేస్తున్నారు.
గోవాలో బెట్టింగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు.. పట్టుబడిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.


