TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియ అరెస్ట్.. 

Published on: Wed Jan 6, 2021 11:41AM

తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియను హైదరాబద్ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కిడ్నాప్ కేసులో ఆమెతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ ను కూడా అరెస్ట్ చేసారు. కూకట్ పల్లిలోని లోథా అపార్ట్ మెంట్స్ సమీపంలో వారిద్దర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె వాహనంలోనే పోలీసు స్టేషన్ కు తరలించారు. అయితే ఈ కేసులో తమపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అఖిల ప్రియ తెలిపారు. తన భర్త కిడ్నాప్ చేయించే వ్యక్తి కాదని.. భార్గవ్‌కు ఈ కిడ్నాప్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయలేదని.. తనకు కొంత సమయం ఇస్తే అన్ని విషయాలు మీడియాకు తెలుపుతానన్నారు. కేవలం ఒక వైపు వాదనలు విని... తమపై తప్పుడు వార్తలు ప్రసారం చేయవద్దని ఆమె మీడియాను కోరారు. మీడియా అంటే తమ కుటుంబానికి చాలా గౌరవం ఉందని.. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు.

 

ఇదిలా ఉండగా.. గతరాత్రి కిడ్నాప్‌కు గురైన ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ముగ్గురు సీఎం కేసీఆర్‌ సోదరి తరఫు సమీప బంధువులు. అంతేకాకుండా వీరు సీఎం కేసీఆర్‌ పీఏ వేణుగోపాలరావుకు బావమరుదులు. ఐటీ అధికారులమంటూ గతరాత్రి ప్రవీణ్ రావు ఇంట్లోకి చొరబడ్డ కిడ్నాపర్లు.. భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రవీణ్‌రావు సహా ఇద్దరు సోదరులను దుండగులు కిడ్నాప్‌ చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాప్‌కు గురైన ప్రవీణ్, నవీన్, సునీల్‌లను వికారాబాద్‌లో గుర్తించారు. భూమా నాగిరెడ్డి బ్ర‌తికి ఉన్న స‌మ‌యం నుండే త‌మ మ‌ధ్య ఈ భూవివాదం ఉన్న‌ట్లు కిడ్నాప్ కు గురైన సీఎం కేసీఆర్ బంధువులు ప్ర‌వీణ్ రావు పోలీసుల‌కు తెలిపిన‌ట్లు తెలుస్తోంది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేయగా.. మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ సోదరుడు చంద్రహాస్‌ పోలీసుల అదుపులో ఉన్నారు. హాఫీజ్‌పేటలోని వంద కోట్ల విలువైన భూమి కోసం కొంతకాలంగా గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే అఖిలప్రియ దంపతులను బోయిన్ పల్లి పోలీసు స్టేషన్ లో విచారించిన తరువాత కోర్టులో ప్రవేశపెడతారని తెలుస్తోంది.