జాతీయ గీతం ఆలపిస్తూ సిరాజ్ కన్నీళ్లు .. సోషల్ మీడియాలో వైరల్
Published on: Thu Jan 7, 2021 9:23AM
టీమ్ ఇండియా పేసర్ , హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ కంటతడి పెట్టాడు. ఇటీవలే తండ్రిని కోల్పోయిన సిరాజ్.. ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యాడు. సిడ్నీలో మ్యాచ్ ఆరంభానికి ముందు జాతీయ గీతం ఆలపించిన సమయంలో ఈ హైదరాబాద్ పేసర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయాడు. రెండు చేతులతో ఆ కన్నీటిని తుడుచుకుంటూ కనిపించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ వీడియోను ట్వీట్ చేసింది.
సిరాజ్ కంటతడి పెట్టిన విజువల్స్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారంలో కనిపించడంతో.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సిరాజ్ కంటతడి పెట్టిన దృశ్యాలను చూసి అభిమానులు సైతం విచారం వ్యక్తం చేశారు. సీనియర్ పేసర్ మహ్మద్ షమి తొలి టెస్టులో గాయపడగా సిరాజ్ రెండో టెస్టుకు ఎంపికయ్యాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు సిరాజ్. దీంతో మూడో టెస్టులోనూ అతనికి అవకాశం వచ్చింది. గురువారం మ్యాచ్ ప్రారంభమైన సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యాడు హైదరాబాద్ పేసర్.
మూడో టెస్ట్ మ్యాచ్ ఆరంభమైన కొద్దిసేపటికే సిరాజ్ భారత్‌కు శుభారంభం అందించాడు. ఆస్ట్రేలియా ఓపెనర్, ప్రమాదకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్(5)ను ఔట్ చేశాడు. నాలుగో ఓవర్‌లో ఓ చక్కటి బంతిని వేసి బోల్తా కొట్టించాడు. ఆఫ్‌స్టంప్‌కు దూరంగా ఊరించే బంతి వేయడంతో వార్నర్ స్లిప్‌లో పుజారా చేతికి చిక్కాడు. మూడో టెస్టులో సిరాజే భారత బౌలింగ్ కు ప్రధాన ఆయుధంగా మారాడు.


