TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నమ్మిన డ్రైవర్ నట్టేట ముంచాడు.. రూ.17 లక్షలతో పరార్!

Published on: Tue Jun 23, 2026 5:02PM

 

ఏటీఎంలో నగదు నింపే వ్యాన్ డ్రైవర్ నగదుతో పరార్...

హైదరాబాద్ పాతబస్తీలో సంచలనం సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏటీఎంలలో నగదు నింపేందుకు వెళ్లిన క్యాష్ వ్యాన్ డ్రైవర్, నగదు బాక్స్‌లోని రూ.17 లక్షలు అపహరించి పరారయ్యాడు. ఈ ఘటన ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్‌నగర్–చాంద్రాయణగుట్ట ప్రాంతంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఏటీఎంలలో నగదు నింపేందుకు క్యాష్ వ్యాన్‌లో డ్రైవర్‌తో పాటు సిబ్బంది బయలుదేరారు. మార్గమధ్యంలో ఓ ఏటీఎం వద్ద వ్యాన్‌ను నిలిపి, సిబ్బంది నగదు నింపేందుకు లోపలికి వెళ్లారు. ఇదే అవకాశంగా భావించిన డ్రైవర్, వ్యాన్‌లోని నగదు బాక్స్ నుంచి రూ.17 లక్షలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చిన సిబ్బందికి డ్రైవర్ కనిపించలేదు. అతడికి ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే నగదు లెక్కలు పరిశీలించగా రూ.17 లక్షలు మాయమైనట్లు గుర్తించారు. దీంతో సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన ఐఎస్ సదన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, డ్రైవర్ ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ చోరీకి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. నగదు తీసుకున్న అనంతరం అతడు ద్విచక్ర వాహనంపై పరారైనట్లు గుర్తించారు.

నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో ఏటీఎంలకు నగదు రవాణా చేసే వాహనాల భద్రతా వ్యవస్థ, నగదు నిర్వహణ విధానాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్న పోలీసులు, నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.