ఎంఎంటీఎస్‌లో పాము.. హడలిపోయిన ప్రయాణీకులు

మీరు ఎక్కిన ఎంఎంటీఎస్ రైలులో పాము ఉందని తెలిస్తే.. ఆ మాట వింటేనే గుండె హడలిపోతుంది కదూ..! మరి అలాంటిది నిజంగా పాము కనిపిస్తే ఇంకేమైనా ఉందా..? నిన్న అచ్చం అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు కొందరు ప్రయాణికులు. లింగంపల్లి నుంచి ఫలక్‌నూమా వెళతున్న ఎంఎంటీఎస్ రైలు జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్‌ చేరుకోగానే ఓ బోగీలో నాగుపాము ఉండటాన్ని ప్రయాణికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోగానే పోలీసులు బోగీని ఖాళీ చేయించి, ప్రయాణికులను మరో బోగీలోకి ఎక్కించి.. పాము కోసం వెతికారు. అయినప్పటికీ పాము జాడ తెలియరాలేదు. దీంతో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్‌ సొసైటీ ప్రతినిధులకు సమాచారం అందించి ఫలక్‌నూమా స్టేషన్ వద్ద అణువణువు గాలించారు. పాము బోగీని ఖాళీ చేసి వెళ్లిపోయి ఉండవచ్చని వారు నిర్థారించారు. అయితే ఈ తతంగం జరుగుతున్నంత సేపు రైలులో ప్రయాణం చేస్తున్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ గడిపారు.