హైదరాబాద్‌లో 2 గంటల పాటు నిలిచిపోయిన మెట్రో

ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో ప్రజలకు అందుబాటులోకి వచ్చి నెల గడిచింది. ఈ నెల రోజుల్లో మిగిలిన మెట్రో నగరాలతో పోలిస్తే ఎక్కువ ఆదరణను చూపారు భాగ్యనగర ప్రజలు. మెట్రో నుంచి నగర అందాలను తిలకిస్తూ వారు కొత్త అనుభూతి చెందుతున్నారు. అలాంటి మెట్రో సేవలు ఇవాళ రెండు గంటల పాటు నిలిచిపోయాయి. సాంకేతిక లోపంతో ఓ మెట్రో రైలు అమీర్‌పేట స్టేషన్‌లో నిలిచిపోయింది. దీంతో అమీర్‌పేట-నాగోల్ మధ్య రెండు గంటల పాటు మెట్రో సేవలు నిలిచిపోయాయి. వెంటనే స్పందించిన మెట్రో అధికారులు అమీర్‌పేటలో నిలిచిపోయిన రైలును ప్రకాశ్‌నగర్‌లోని అదనపు ట్రాక్‌పైకి తీసుకురావడంతో మిగిలిన రైళ్ల సేవలకు ఆటంకం తొలగింది. అనంతరం రెండు గంటల విరామం తర్వాత మెట్రో రైళ్లు పరుగులు పెట్టాయి.