ఫస్ట్ డే జర్నీలో.. కొంచెం కంగారు.. కొంచెం కష్టాలు

దశాబ్ధాల హైదరాబాదీల కల మంగళవారం సాకారమైంది. ఆ రోజు మధ్యాహ్నం మియాపూర్ వేదికగా హైదరాబాద్ మెట్రోను ప్రధాని నరేంద్రమోడీ జాతికి అంకితం చేశారు. మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకు.. తిరిగి కూకట్‌పల్లి నుంచి మియాపూర్ వరకు ప్రధాని మెట్రో రైలులో ప్రయాణించారు. ప్రారంభోత్సవం రోజున ప్రజల్ని మెట్రో ప్రయాణానికి అనుమతించకుండా ఆ తర్వాతి రోజు నుంచి వీలు కల్పిస్తామని అధికారులు ముందుగానే తెలిపారు. ఎప్పుడెప్పుడు మెట్రో ఎక్కుదామా అని వేచి చూసిన జనం బుధవారం ఉదయం ఆరు గంటలకు అన్ని మెట్రో స్టేషన్ల వద్దకు భారీగా చేరుకోవడంతో పండుగ వాతావరణం కనిపించింది.

 

మొదటి సర్వీసు నాగోల్ నుంచి మియాపూర్‌ వరకు నడిచింది. తొలి రోజు ప్రయాణికులకు మధుర స్మృతిగా మిగిలిపోయింది. "మెట్రో జర్నీ సేఫ్ అండ్ స్పీడ్ జర్నీ" అని మెజారిటీ జనాలు అంటున్నారు. సాధారణంగా ఉప్పల్ నుంచి మియాపూర్ వెళ్లాలంటే రెండు, మూడు గంటలు పడుతుందని.. అలాంటిది నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అయితే ఫస్ట్ డేజర్నీలో చిన్న చిన్న షాకుల్ని కూడా టేస్ట్ చేశారు ప్యాసింజర్స్.

 

కాయిన్ ఉన్నా కానీ ఎంట్రీ అండ్ ఎగ్జీట్ గేట్స్ ఓపెన్ కాకపోవడంతో పలువురు ప్రయాణికులు సిబ్బందితో గొడవపడ్డారు. మరికొందరైతే తాము దిగాల్సిన స్టేషన్‌లో దిగలేక నెక్ట్స్ స్టాప్‌లో దిగాల్సి వచ్చింది. టికెట్ ఒక స్టేషన్‌కి కొనుగోలు చేసి మరో స్టేషన్‌లో దిగడంతో అక్కడ గేట్స్ తెరుచుకోలేదు. తొలి రోజు కావడం.. ప్రయాణికులకు సరైన అవగాహన లేకపోవడంతో అధికారులు కూడా వారిని వదిలేశారు. తొలి రోజు కొద్ది మంది వ్యక్తిగత అవసరాల కోసం మెట్రో జర్నీ చేయగా.. మెజార్టీ ప్రజలు మాత్రం మెట్రో అనుభూతి కోసమే ప్రయాణించారు. వీరిలో ఎక్కువ మంది యువత, విద్యార్థులే ఉన్నారు. బుధవారం అర్థరాత్రి వరకు సుమారు లక్షమంది మెట్రోలో ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.