గులాబీ కార్యకర్తలకే వరద సాయం! గ్రేటర్ లో కొత్త పంచాయితీ 

కుండపోత వానలు, వరదలతో గ్రేటర్ హైదరాబాద్ వణికిపోయింది. గతంలో ఎప్పుడు లేనంతగా వరద నగరాన్ని ముంచెత్తింది. దాదాపు 15 వందల కాలనీలు రెండు, మూడు రోజుల పాటు మోకాళ్ల లోతు నీటిలోనే ఉండి పోయాయి. ఇండ్లు కూలి, వరదల్లో కొట్టుకుపోయి వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వేలాది  ఇండ్లు నీట మునిగాయి. వరద తగ్గినా ఇంకా కొన్ని బస్తీలు బురదలోనే ఉన్నాయి. వరద కట్టడిలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం.. బాధితులకు మాత్రం నష్ట పరిహారం ప్రకటించింది. వరద ముంచెత్తిన కాలనీల్లోని ప్రతి కుటుంబానికి 10 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. వరద బాధితులకు నష్ట పరిహారం ఇవ్వడం బాగానే ఉన్నా... పంపిణిలో మాత్రం మళ్లీ అవకతకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నిజమైన వరద బాధితులకు కాకుండా అధికార పార్టీ నేతలు చెబుతున్నవారికే డబ్బులు ఇస్తున్నారనే విమర్శలు చేస్తున్నారు జనాలు.

 

వరదలతో తీవ్ర నష్టం జరిగిన ప్రాంతాల్లో తిరిగి జీహెచ్ఎంసీ అధికారులు వివరాలు సేకరించారు. అయితే అవి కూడా తప్పుడు తడకలుగా ఉన్నాయని చెబుతున్నారు. అధికార పార్టీ నేతలు, లోకల్ కార్పొరేటర్, వార్డు లీడర్లు చెప్పిన పేర్లతోనే అధికారులు జాబితాలు తయారు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. తమ పార్టీ వారికే టీఆర్ఎస్ నేతలు పరిహారం ఇప్పిస్తున్నారని చాలా ప్రాంతాల్లో ఆందోోళనలు  జరుగుతున్నాయి. చెక్కుల పంపిణికి వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లను పరిహారం కోసం నిలదీస్తున్నారు నిజమైన వరద బాధితులు. వరదలతో ముంపుకు గురైన వారికి నష్ట పరిహారం  ఇవ్వాలి గాని.. ఇలా ఎవరికి  పడితే వారికే ఇవ్వడమేంటనీ ప్రశ్నిస్తున్నారు బాధితులు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే  మైనంపల్లికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. గోషామహాల్ పరిధిలో చెక్కుల పంపిణికి వెళ్లిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను స్థానికులు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలకే వరద సాయం పేరుతో నష్ట పరిహారం అందిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.

 

టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలో అంతా వారి చెప్పినట్లే చెక్కుల పంపిణి జరుగుతోంది. అయితే విపక్షాల కార్పొరేటర్లు ఉన్న చోట మాత్రం అలా చేయడం లేదని తెలుస్తోంది. ఈ విషయంపైనే ఆర్కే పురం డివిజన్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకున్నారు స్థానికులు. ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ గా బీజేపీ వ్యక్తి ఉన్నారు.  అయితే వరద బాధితుల లిస్టు మాత్రం ఆమెకు తెలియకుండానే తయారైందట. వరదలతో సమయంలో గల్లీగల్లీ తిరిగి ప్రజల కష్టాలు చూసిన తనకు తెలియకుండా లిస్టు ఎలా ప్రిపేర్ చేస్తారని మంత్రి సబిత ముందే బీజేపీ కార్పొరేటర్ ఆందోళనకు దిగారు. అధికార పార్టీ నేతలు చెప్పినవారి పేర్లతో తయారు చేశారని,  వరద సాయంలోనే రాజకీయం చేయడమేంటనీ ఆమె సబితను నిలదీశారు. స్థానికులు కూడా భారీగా వచ్చి టీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చెక్కుల పంపిణిని హడావుడిగా చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

 

కొన్ని డివిజన్లలో అధికార పార్టీ నేతలు మరింత బరితెగించారని చెబుతున్నారు. అసలు ముంపే లేని ప్రాంతాల్లో కూడా చెక్కులు ఇస్తున్నారని తెలుస్తోంది. ఫేక్ బాధితులకు చెక్కులు ఇచ్చి.. తర్వాత వారికి కొంత ఇచ్చి మిగితాదంతా గులాబీ నేతలు నొక్కేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు, టీఆర్ఎస్ నేతలు కలిసి వరద సాయాన్ని కాజేస్తున్నారనే విమర్శలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో గ్రేటర్ ఎన్నికల్లో తమకు ఓటు వేస్తామని హామీ ఇస్తేనే చెక్కులు ఇస్తామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని సమాచారం. వరద సాయాన్ని ఓట్ల కోసం ఉపయోగించుకోవడంపై అన్ని వర్గాలు మండిపడుతున్నాయి.

 

భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ లో అపార నష్టం జరిగిందని సీఎం కేసీఆర్, కేటీఆర్ చెబుతున్నారు. గ్రేటర్ వరద బాధితులకు సాయం కోసం విరాళాలు ఇవ్వాలని కోరుతున్నారు. సర్కార్ పిలుపుతో టాలీవుడ్ స్టార్లు, వ్యాపార వేత్తలు, ఐటీ సంస్థలు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నాయి. వరద బాధితులకు సాయం పేరుతో విరాళాలు సేకరిస్తున్న ప్రభుత్వం.. పరిహారాన్ని సరిగ్గా పంపిణి చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. తమ పార్టీ నేతల జేబులు నింపేందుకే కేసీఆర్, కేటీఆర్లు సినీ, వ్యాపార, వాణిజ్య ప్రముఖులపై ఒత్తిడి తెచ్చి మరీ విరాళాలు సేకరిస్తున్నారా అని విపక్షాలు ఫైరవుతున్నాయి. వరద కట్టడిలో విఫలమైన ప్రభుత్వం.. వరద సాయంలో రాజకీయం చేయడం దారుణమంటున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. ఇప్పటికేనా ప్రభుత్వం చిల్లర పనులు మానుకోవాలని సూచిస్తున్నాయి. మొత్తంగా వరద బాధితులకు అందించే నష్ట పరిహారం విషయంలోనూ అక్రమాలు జరగడం సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.