కిడ్నాప్ సూత్రధారి అఖిలప్రియే!  అన్ని అధారాలు ఉన్నాయన్న సీపీ 

హైదరాబాద్ లో కలకలం రేపిన  బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు కీలకు మలుపు తిరిగింది. ఈ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియే కిడ్నాప్ సూత్రధారి అని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. బోయిన్‌పల్లిలో జరిగిన కిడ్నాప్ కేసును ఛేదించి ఆధారాలను సీపీ మీడియాకు వివరించారు. కిడ్నాప్  కేసులో  మరో  ముగ్గురిని అరెస్ట్‌ చేశామని.. నిందితులు వాడిన సెల్‌ఫోన్లు, నకిలీ నెంబర్‌ప్లేట్లను సీజ్‌ చేసినట్లు సీపీ తెలిపారు. ఆరు సిమ్‌కార్డులను మియాపూర్‌లోని మొబైల్‌ షాప్‌లో కొనుగోలు చేసినట్టు మల్లికార్జున్‌రెడ్డి అనే వ్యక్తి చెప్పారని సీపీ చెప్పారు. కిడ్నాప్‌ కోసం అఖిలప్రియ 70956 37583 ఫోన్ నెంబర్లను వాడారని సీపీ వెల్లడించారు. కూకట్‌పల్లిలోని నిందితులు ఓ హోటల్‌లో రూమ్‌ తీసుకున్నారని, కిడ్నాప్‌ కేసులో భార్గవ్‌రామ్‌ పాత్ర కూడా ఉందని ఆయన తెలిపారు. ఈ కేసులో అఖిలప్రియ అనుచరుడు సంపత్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశామన్నారు. ప్రవీణ్‌రావు ఇంటి దగ్గర నిందితులు రెక్కీ నిర్వహించారని అంజనీకుమార్‌ తెలిపారు.

‘‘విజయవాడ నుంచి హైదరాబాద్‌ వరకు టవర్‌ లోకేషన్ల ట్రేసింగ్‌ చేశాం. భార్గవ్‌రామ్‌, గుంటూరు శ్రీనుకు నిందితులు టచ్‌లో ఉన్నారు. కూకట్‌పల్లి లోదా నుంచి యూసఫ్‌గూడ ఎంజీఎం స్కూల్‌కి భార్గవ్‌రామ్‌ వచ్చారు. అఖిలప్రియ నెంబర్‌ నుంచి గుంటూరు శ్రీనుకు 49 ఫోన్ కాల్స్  వెళ్లాయి. గుంటూరు శ్రీను నుంచి మరో నిందితుడికి మధ్య 28 కాల్స్‌ నడిచాయి. గుంటూరు శ్రీను నుంచి ఇంకో నిందితుడికి మధ్య 16 కాల్స్‌ ఉన్నాయి. కిడ్నాప్‌ జరుగుతున్నంత సేపు కిడ్నాపర్లతో శ్రీను మాట్లాడాడు. కిడ్నాప్‌ కేసులో మొత్తం 143 కాల్స్‌ను పోలీసులు ట్రేస్‌ చేశారు. కిడ్నాప్‌ కోసం టెంపరరీ సిమ్స్‌ గ్యాంగ్‌ ఉపయోగించింది’’ అని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు. అఖిలప్రియ  అరెస్ట్ సమయంలో మహిళా ఇన్‌స్పెక్టర్‌ ఉన్నారని, వైద్య పరీక్షలు నిర్వహించడంలో కూడా నిర్లక్ష్యం లేదని చెప్పారు అంజనీ కుమార్. పోలీసులపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు.