TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి సరికొత్త ఏఐ అస్త్రం....సాక్ ఐ ప్రారంభం

Published on: Mon May 18, 2026 8:36PM

 

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, విద్వేషపూరిత కంటెంట్‌ను అరికట్టేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం అత్యాధునిక కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థ ‘సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్ (SOCI – సాక్ ఐ)’ను ప్రవేశపెట్టింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినూత్నంగా వినియోగించడంలో ముందుండే హైదరాబాద్ పోలీస్ ఐటీ విభాగం అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ ద్వారా సోషల్ మీడియా వేదికలపై జరిగే కార్యకలాపాలను నిరంత రాయంగా విశ్లేషించడం సాధ్యమవుతుంది. 

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సూచనలు, అలాగే ఆన్‌లైన్‌లో వ్యాపించే తప్పుడు సమాచారాన్ని ఇది ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. గతంలో సోషల్ మీడియా పర్యవేక్షణకు పెద్ద సంఖ్యలో సిబ్బంది అవసరమయ్యేది. కానీ ‘సాక్ ఐ’ ద్వారా ఇప్పుడు మొత్తం ప్రక్రియ ఆటోమేటెడ్‌గా మారి రియల్‌టైమ్ మానిటరింగ్ సాధ్యమవుతోంది. ఇంటిగ్రేటెడ్ డ్యాష్‌బోర్డ్ ద్వారా డయల్ 100 కాల్స్, ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్, నగరంలో జరుగుతున్న ముఖ్య ఘటనల వివరాలు అన్నీ ఒకే వేదికపై లభిస్తాయి.

ప్రయోగాత్మక దశలోనే ఈ వ్యవస్థ కీలక ఫలితాలను ఇచ్చింది. పురానాపూల్ ఎక్స్ రోడ్ ఘటనకు సంబంధించి 85 విద్వేషపూరిత పోస్టులు, గుడిమల్కాపూర్ వివాదానికి సంబంధించిన 126 సోషల్ మీడియా పోస్టులను ఇది గుర్తించింది. వీటిపై తక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా పరిస్థితులు మరింత ఉద్రిక్తం కాకుండా నియంత్రించగలిగారు. మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లు, మహిళలు–పిల్లల భద్రతకు సంబంధించిన అంశాలు, సైబర్ బుల్లీయింగ్, స్టాకింగ్ వంటి సమస్యలపై ఈ ఏఐ వ్యవస్థ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. 

కంటెంట్‌ను హై, మీడియంలో రిస్క్ కేటగిరీలుగా విభజించి సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు అలర్ట్‌లు పంపుతుంది. అంతేకాకుండా, పదేపదే వివాదాస్పద కంటెంట్‌ను షేర్ చేసే ఖాతాలను గుర్తించడం, నెట్‌వర్క్ విశ్లేషణ చేయడం, అలాగే సోషల్ మీడియా ఫిర్యాదులకు యూనిక్ ట్రాకింగ్ నంబర్ ఇవ్వడం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రతి ఫిర్యాదు పరిష్కారాన్ని ఎండ్-టు-ఎండ్ మానిటరింగ్ ద్వారా ట్రాక్ చేయవచ్చు.

ఈవెంట్ బేస్డ్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా ర్యాలీలు, నిరసనలు, మతపరమైన కార్యక్రమాలపై ముందస్తు నిఘా ఉంచడం సాధ్యమవుతుంది. అలాగే SOCMINT, OSINT వంటి ఆధునిక ఇన్వెస్టిగేషన్ టూల్స్ కూడా ఇందులో భాగంగా ఉండటంతో సైబర్ కేసుల దర్యాప్తు మరింత వేగవంతమవుతుంది. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ఐపీఎస్ మాట్లాడుతూ, “సమాజంలో అశాంతి రేకెత్తించే శక్తులను నియంత్రించడమే లక్ష్యం. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ ఈ వ్యవస్థను అభివృద్ధి చేశాం. మారుతున్న సాంకేతిక యుగానికి అనుగుణంగా నేర నియంత్రణలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది” అని తెలిపారు.