త్వరలో రోడ్డెక్కనున్న హైదరాబాద్ సిటీ బస్సులు

గడచిన మార్చి నెలలో కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా జనతా కర్ఫ్యూ తరువాత హైదరాబాద్ లో సిటీ బస్సులు రోడ్డెక్కని సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుండి తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు బస్సులు నడుస్తున్నప్పటికీ హైదరాబాద్ లో సిటీ బస్సులు మాత్రం రోడ్డెక్కలేదు. కొద్ది రోజుల క్రితం లాక్ డౌన్ సడలింపులతో నగరంలోని మెట్రో రైలును కూడా కొన్ని షరతులతో తిరిగి ప్రారంభించినా సిటీబస్సులకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీనికి ప్రధాన కారణం కరోనా నిబంధనలతో సిటీ బస్సులలో రద్దీని కంట్రోల్ చేయడం కష్టమని సర్కార్ భావించిందని వార్తలు వచ్చాయి.

 

అయితే తాజాగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో ఆర్టీసీ బస్సుల‌ను పున ప్రారంభించేందుకు ముహుర్తం ఖ‌రారు అయ్యింది. క‌రోనా సమస్య ఉన్నప్పటికీ ఇత‌ర రాష్ట్రాల్లోని మెట్రో న‌గ‌రాల్లో సిటీ బ‌స్సులు ఎప్పుడో ప్రారంభం అయ్యాయి. ముంబై, చెన్నై, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల్లో ఇప్పటికే బ‌స్సులు తిరుగుతుండ‌టంతో… అక్క‌డ ప‌రిస్థితులను అధ్య‌య‌నం చేసిన తెలంగాణ‌ ఆర్టీసీ అధికారులు.. మొద‌ట ద‌శ‌లో 50శాతం బ‌స్సుల‌ను నడిపి, తరువాత ద‌శ‌ల వారీగా బస్సులను పెంచాల‌ని డిసైడ్ అయిన‌ట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ప్ర‌యాణికుల‌ను కేవ‌లం సీట్ల వ‌ర‌కే పరిమితం చేయాలనీ నిలబడి, లేదా కిక్కిరిసేలా ప్ర‌యాణికుల‌ను ఎక్కించకూడదని అధికారులు నిర్ణ‌యించారు. దీంతో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే 7 రూట్లలో సిటీ బస్సు సర్వీస్‌లు ముందుగా ప్రారంభించే అవకాశం ఉంది. ఒకసారి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ నెలాఖరుకు సిటీ బస్సులు ప్రారంభమయ్యే అవ‌కాశం ఉంది.