హైదరాబాద్ ‘యూటీ’ తో మజ్లిస్ ‘యూ’ టర్న్

 

హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయబోతున్నారనే వార్త తెలంగాణా నేతలలో కలకలం రేపింది. ముఖ్యంగా హైదరాబాదుకి చెందిన దానం నాగేందర్, మజ్లిస్ నేతలు అసదుద్దీన్ వంటి వారు ఈ వార్తలతో చాలా కలవరపడ్డారు. కారణం అలాగ చేస్తే హైదరాబాదు కేంద్రప్రభుత్వపాలన క్రిందకు వెళ్ళిపోయి అక్కడ ఎన్నికలు జరుగవు. అప్పుడు వారందరూ మరెక్కడినుంచయినా పోటీ చేయవలసివస్తుంది. కేవలం హైదరాబాదుకే పరిమితమయిన నేతలకి ఇది నిజంగా ప్రాణ సంకటమే అవుతుంది. గనుక వారు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు.

 

ఇంతవరకు సమైక్యాంధ్రకు మొగ్గు చూపిన మజ్లిస్ పార్టీ నేతలు అసదుద్దీన్, అక్బరుదీన్ ఓవైసీలు ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణాలో అంతర్భాగమని దానిని ఏవిధంగాను విడదీయడానికి తాము ఒప్పుకోమని గట్టిగా చెప్పడానికి కారణం ఇదే. హైదరాబాద్ జోలికి రానంత వరకు రాష్ట్రం కలిసి ఉన్నా,విడిపోయినా తమకు అభ్యంతరం లేదన్నట్లు వ్యవహరించిన ఒవైసీ సోదరులు, ఇప్పుడు తమ రాజకీయ ఉనికే ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఏర్పడటంతో మాట మార్చితాము కూడా ఆందోళనకు సిద్ధమని చెపుతున్నారు.

 

వారి ఈ బలహీనతలు అర్ధం చేసుకొన్నతెరాస ఈ ప్రతిపాదన అమలు చేస్తే మజ్లిస్ పార్టీతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెడతామని కేంద్రాన్నిహెచ్చరించింది. ఏమయినప్పటికీ, కేంద్రం ముందుగా ఇటువంటి మీడియా లీకులు ఇచ్చిదానికి వచ్చిన ప్రతిస్పందన బట్టి ఎప్పటికప్పుడు తన వ్యూహం మార్చుకొని ముందుకు సాగుతోంది. ఇది చూస్తే ఈ మీడియా లీకులు కూడా ఇప్పుడు రాజకీయ వ్యూహంలో భాగమయిపోయినట్లు అర్ధం అవుతోంది.