TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అందాల పోటీలు నిర్వహించటానికి.. సీఎం రేవంత్‌కు బుద్ధి లేదు : సీపీఐ నారాయణ

Published on: Wed Apr 30, 2025 3:46PM

 

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల  నిర్వహించనుండటంపై సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో తన మేనకోడలికి చెందిన ఓ వాణిజ్య సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, ఈ విషయంపై మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అందాల పోటీలు నిర్వహించడం ద్వారా పవిత్రమైన స్త్రీ జాతిని అవమానిస్తున్నారని నారాయణ ఆరోపించారు. "అందాల పోటీ అంటే స్త్రీలను నడిరోడ్డు మీద వేలం వేయడం కాదా? ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి పోటీలు నిర్వహించే ముఖ్యమంత్రికి బుద్ధి లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు రూ.25 కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పడం సిగ్గుచేటన్నారు. 

ప్రభుత్వాలు మహిళలను స్వయం శక్తితో జీవించేలా ప్రోత్సహించాలని, వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నారాయణ సూచించారు. అందాల పోటీల పేరుతో మహిళల గౌరవాన్ని కించపరచడం సరికాదని, ఈ పోటీలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. తన మేనకోడలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి, పది మందికి ఉపాధి కల్పించేందుకు సొంత వ్యాపారం ప్రారంభించడాన్ని ఆయన అభినందించారు. మహిళలు ఇలా స్వయం ఉపాధి వైపు రావడాన్ని ప్రోత్సహించాలే తప్ప, అందాల పోటీలతో వారిని అపవిత్రం చేయకూడదని నారాయణ హితవు పలికారు. తన మేనకోడలు అందాల పోటీలో పాల్గొంటే ఫస్ట్ వస్తుందని... కానీ, అది తప్పు అని అన్నారు.