TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రేపటి నుంచి వైన్స్ బంద్ ఎందుకంటే?

Published on: Sun Apr 20, 2025 5:51PM

 

ఈ నెల 23న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని వైన్స్ షాపులు ఈ నెల 21 సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వైన్ షాపు అనుమతులు రద్దు చేస్తామని ఇప్పటికే హైదరాబాద్ సీపీతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. అలాగే ఎవరైనా పరిమితికి మించి స్టాక్ ఉంచి.. ఏదైనా ప్రదేశంలో విక్రయించినా నేరంగానే పరిగణిస్తామని పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. 

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ అసన్‌ ఎఫెండ్‌ను మజ్లిస్ పార్టీ ఖరారు చేసింది. బీజేపీ తరపున ఎన్ గౌతంరావు బరిలో ఉన్నారు ఇప్పటివరకు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ, ఎంఐఎంతో పాటు మరో రెండు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు దాఖలయ్యాయి. పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నిర్ణయించాయి. కాంగ్రెస్‌ మద్దతుతో ఎంఐఎం ఏకగ్రీవం అవుతుందనే సమయంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ నామినేషన్‌తో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ, ఎంఐఎం అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొననుంది. ఈ నెల 23న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.  25 తేదీన కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలు ప్రకటించనున్నారు.