TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జూబ్లీహిల్స్‌లో తాగునీటితో వాకిలి కడిగిన యజమానికి షాక్..!

Published on: Fri Jul 17, 2026 9:20PM

 

హైదరాబాద్ నగరంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉన్న వేళ తాగునీటిని వృథా చేసిన ఓ ఇంటి యజమానికి జలమండలి అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. ఇంటి వాకిలిని తాగునీటితో శుభ్రం చేస్తూ నీటిని వృథా చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు రూ.5 వేల జరిమానా విధిస్తూ నోటీసు జారీ చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి, రోడ్ నెం.33లో చోటుచేసుకుంది.

స్థానికుల కథనం ప్రకారం.. రోడ్ నెం.33లోని ఓ ఇంటి యజమాని తాగునీటితో ఇంటి ఆవరణను కడుగుతూ పెద్ద మొత్తంలో నీటిని వృథా చేస్తున్నాడు. ఒకవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు బిందెడు మంచినీటి కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) అధికారులకు సమాచారం అందించారు.

ఫిర్యాదు అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. విచారణలో ఫిర్యాదు నిజమేనని తేలడంతో ఇంటి యజమానికి రూ.5 వేల జరిమానా విధిస్తూ నోటీసు అందజేశారు. అలాగే ఏడు రోజులలోపు జరిమానా చెల్లించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా జలమండలి అధికారులు మాట్లాడుతూ.. నగరంలో తాగునీటి కొరత నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనదని తెలిపారు. తాగునీటిని ఇళ్ల ప్రాంగణాలు కడగడం, వాహనాలు శుభ్రం చేయడం వంటి అవసరం లేని పనులకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాగునీటిని వృథా చేస్తున్న వారిపై స్థానికులు సమాచారం అందించాలని కోరారు. ఇటీవల నగరంలో నీటి వృథాపై ప్రత్యేక దృష్టి సారించిన జలమండలి అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై వరుసగా చర్యలు చేపడుతున్నారు.

Hyderabad, Jubilee Hills, HMWSSB, Drinking Water, Water Wastage, ₹5,000 Fine, Water Inspection, GHMC, CM Revanth reddy