ఎసిబి జెడి శ్రీనివాస రెడ్డి బదిలీ
Published on: Fri Apr 6, 2012 2:43PM
హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డికి బదలీ మెమో జారీ అయింది. సాధారణ పరిపాలన శాఖ ఆయనకు పోలీసుల సహాయంతో బదలీ మెమో జారీ చేసింది. వెంటనే కొత్త బాధ్యతలు చేపట్టాలని సిఎస్ ఆదేశించారు. విజయనగరం జిల్లాలో మద్యం సిండికేట్ల వ్యవహారంపై శ్రీనివాస్ రెడ్డి దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. మద్యం సిండికేట్లలో దాగున్న బడా బాబుల హిస్టరీని తవ్వి తీస్తున్న శ్రీనివాస రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినా ఆయనను రిలీవ్ చేసేందుకు ఏసీబీ డీజి భూపతి బాబు ససేమిరా అనడంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.
మంగళవారం అర్థరాత్రి శ్రీనివాస రెడ్డికి ప్రమోషన్ ఇస్తూ ప్రభుత్వం బదిలీ ఆదేశాలను జారీ చేసింది. కానీ సిండికేట్ల వ్యవహారం కీలక దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో శ్రీనివాస రెడ్డిని రిలీవ్ చేయడం సాధ్యం కాదంటూ ఏసీబీ డీజీ భూపతి బాబు ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో చీఫ్ సెక్రటరీతో ఏసీబీ డీజి శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. శ్రీనివాస రెడ్డిని బదిలీ చేసినా రిలీవ్ చేయలేకపోవడం వెనుక ఉన్న కారణాన్ని ఆయన వివరించారు. నివేదిక తయారు చేయడంలో ఇబ్బంది తలెత్తుతుందనీ, 16 తర్వాత ఆయనను రిలీవ్ చేస్తానని వివరణ ఇచ్చినట్లు తెలిసింది.
కాగా, విజయనగరం జిల్లా మద్యం సిండికేట్లపై హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉండటంతో జెడి శ్రీనివాస్ రెడ్డి దానిపై తుది కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన సెలవు దినమైనప్పటికీ గురువారం రోజూ పని చేశారు. కాగా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను టార్గెట్ చేసుకున్న కారణంగానే ఆయనను బదలీ చేస్తున్నారనే విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఎసిబి జెడి శ్రీనివాస రెడ్డికి బదలీ మెమోలు పంపించినట్లు మీడియాలో వస్తున్న వార్తలను సాధారణ పరిపాలన సంఘం ఖండించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇదిలావుంటే.. నిజాయితీ గల శ్రీనివాస రెడ్డిని బదిలీ చేయవద్దంటూ అఖిలపక్ష నాయకులు శుక్రవారం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.


