TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్‌ ఆస్తుల కేసు:సిబిఐ విచారణకు మోపిదేవి

Published on: Tue Mar 20, 2012 11:19AM

హైదరాబాద్ : జగన్‌ ఆస్తుల కేసులో ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ, సీనియర్‌ ఐఏఎస్ అధికారి మన్మోహన్‌ సింగ్‌ మంగళవారం సిబిఐ అధికారుల ముందు విచారణకు హాజరు కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తమ ఎదుట హాజరు కావాలని సిబిఐ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన జగన్ ఆస్తుల కేసులో సాక్షిగా హాజరు అవుతున్నారు. తాను మధ్యాహ్నం సిబిఐ ఎదుట హాజరవుతానని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతానని మోపిదేవి చెప్పారు. వివాదాస్పద జివోలలో తన తప్పు లేదన్నారు.

కాగా, వైఎస్‌ హయాంలో పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక సదుపాయల శాఖ మంత్రిగా మోపిదేవి వ్యవహరించారు. ఆ సమయంలో పలు కంపెనీలకు ప్రయోజనాలు చేకూర్చారనే ఆరోపణలపై సీబీఐ ఆయన్ని ప్రశ్నించనుంది. వాస్తవానికి గత వారమే మోపిదేవిని విచారణకు హాజరు కావాలని సీబీఐ కోరింది. అయితే ఉపఎన్నికల ప్రచారం, వ్యక్తిగత పనుల కారణంగా మరికొంత సమయం కావాలని కోరారు.

మరో వైపు సీనియర్‌ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్‌ కూడా సీబీఐ ఎదుట హాజరు కానున్నారు. ఆయన సిబిఐ ఎదుట దిల్ కుషా అతిథి గృహంలో హాజరు కానున్నారు. వెంకటరమణ పెట్టుబడుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మన్మోహన్‌ సింగ్‌ ఆ శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. కాగా జగన్ ఆస్తుల కేసులో ఇప్పటికే విజయ సాయి రెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే. జగన్ ఆస్తుల కేసు విచారణను సిబిఐ వేగవంతం చేసింది. ఈ కేసులో పలు కంపెనీలు, పలువురు వ్యక్తిగతంగా సిబిఐ ఎదుట హాజరవుతున్నారు. వచ్చే నెలలో జగన్ ఆస్తుల కేసులో సిబిఐ చార్జీషీట్ దాఖలు చేయాల్సి ఉంది.