TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెద్దల సభలో చిరుకు అవకాశం

Published on: Mon Mar 19, 2012 11:53AM

హైదరాబాద్: రాజ్యసభలో తమకు దక్కే నాలుగు స్థానాల కోసం కాంగ్రెస్ తమ అభ్యర్థులను ఆదివారం రాత్రి ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే చిరంజీవికి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యత్వం దక్కింది. ప్రజారాజ్యం విలీనం సందర్భంగా చిరంజీవికి ఇచ్చిన మాట మేరకు ఆయనకు పెద్దల సభ అవకాశాన్ని సోనియా గాంధీ కల్పించారు. అంచనాలకు అనుగుణంగానే రేణుకా చౌదరి పేరునూ కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. మిగిలిన రెండు స్థానాల విషయంలో మాత్రం అందరి అంచనాలకూ భిన్నమైన పేర్లను ఖరారు చేసింది. హైకమాండ్‌కు వీర విధేయుడిగా పేరున్న తెలంగాణకు చెందిన సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి అవకాశం కల్పించింది.

ఇదే రీతిలో పీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ జర్నలిస్ట్ అయిన రాపోలు ఆనంద భాస్కర్ అభ్యర్థిత్వాన్ని కూడా హైకమాండ్ చివరి నిమిషంలో ఖరారు చేసింది. తెలంగాణ నుంచి కె.కేశవరావు స్థానంలో మరో బీసీ నేత గురించి అధిష్ఠానం ఆరా తీయడంతో.. కాసాని జ్ఞానేశ్వర్, ఆనంద భాస్కర్ పేర్లు ముందుకు వచ్చాయి. కాసానికి చాలా పార్టీలు పెట్టిన నేపథ్యం ఉన్నందువల్ల.. ఆనంద భాస్కర్‌కు అవకాశం ఇవ్వాలని సోనియా నిర్ణయించారు.

మర్రి చెన్నారెడ్డి హయాంలో ఎంపిక చేసిన ప్రగడ కోటయ్య తర్వాత గత 20 సంవత్సరాలుగా చేనేత వర్గాలకు చెందిన నేతనెవరినీ కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎంపిక చేయలేదన్న విషయాన్ని అధిష్ఠానం దృష్టికి బొత్స తీసుకువెళ్లడంతో.. సామాన్య పద్మశాలీ కుటుంబానికి చెందిన ఆనంద భాస్కర్‌కు పెద్దల సభకు వెళ్లే అవకాశం లభించింది. కాంగ్రెస్‌కు దక్కే నాలుగు స్థానాలనూ మన రాష్ట్రానికి చెందిన నేతలకే ఇచ్చేలా హైకమాండ్‌ను ఒప్పించగలిగారు.