మావోయిస్టులు త్వరలో దాడులు చేస్తారా?
Published on: Tue Mar 13, 2012 11:50AM
హైదరా
బాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అనుసరించిన అణచివేత విధానాల కారణంగా రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బే తగిలింది. పోలీసుల ఒత్తిడి కారణంగా మిగిలిన మావోయిస్టులు పొరుగునే ఉన్న ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ ప్రాంతాల్లో తలదాచుకున్నారు. అయితే వీరంతా మళ్ళీ ఏకమై రాష్ట్రంలో తమ ఉనికితోపాటు సత్తా కూడా రాష్ట్రంలో చూపాలని మావోయిస్టులు నేతలు పధకం వేస్తున్నట్లు సమాచారం. ఈ సమాచారం అందుకున్న పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తమయ్యారు. ఈ దాడులు గుంటూరు, ప్రకాశం, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో జరగవచ్చునన్న అనుమానంతో అక్కడ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
చెన్నై, బెంగుళూరులో రహస్యంగా తయారుచేసిన రాకెట్ లాంచర్లను కొందరు మావోయిస్టులు ఇటీవల నల్లమల అటవీప్రాంతంలో పరీక్షించినట్లు తెలిసింది. గతంలో ప్రకాశంజిల్లా ఎర్రగొండపాలెంలో పోలీస్ స్టేషన్ పై దాడి చేసినప్పుడు నక్సలైట్లు రాకెట్ లాంచర్లను కూడా ప్రయోగించారు. గుంటూరుజిల్లా దుర్గి పోలీస్ స్టేషన్ లో కూడా నక్సల్స్ రాకెట్ లాంచర్లతో పేల్చివేశారు. ఆ తరువాత మరింత ఆధునీకరించిన రాకెట్ లాంచర్లను మావోయిస్టులు సమకూర్చుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సమాచారం అందడంతో ఏజెన్సీ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ల వద్ద కూడా భద్రతా మరింత పెంచారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ రక్షణ వలయాలు ఏర్పాటు చేయడంతో పాటు రాకెట్ లాంచర్లు ప్రయోగించినా అవి పోలీస్ స్టేషన్ల పై పడకుండా ఉండేందుకు ఐరన్ తో చేసిన వలలను కూడా ఏర్పాటుచేస్తున్నారు.


