TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రాణాంతకంగా మారుతున్న నకిలీ పాలు

Published on: Wed Mar 7, 2012 1:56PM

రాష్ట్రంలో యధేచ్చగా విక్రయాలు
తెలుగువన్.కామ్ ప్రత్యేక కథనం

హైదరాబాద్: కాదేదీ కవితకు అనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అయితే కాదేదీ కల్తీకి అనర్హం అంటున్నారు నేటి కల్తీరాయుళ్ళు. ఈ కల్తీరాయుళ్ళు పాలను కూడా వదలడం లేదు. వీరి కల్తీ పాలు ప్రజలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. పూర్వం పాలలో నీళ్ళుకలిపితే అదో పెద్ద కల్తీగా భావించేవారు. ఇప్పుడు నీళ్ళుకాకుండా ప్రమాదకర రసాయనాలతో 'ప్లాస్టిక్' పాలు తయారుచేసి ఈ కల్తీరాయుళ్ళు ప్రజలప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అంతేకాక పాలదిగుబాడిని పెంచడానికి కూడా ప్రమాదకర రసాయనాలను వాడటానికి కూడా వెనుకాడటం లేదు. ఆవులు, గేదెలు ఎక్కువపాలు ఇవ్వకపోతే ఆక్సిటోసిల్ ఇంజక్షన్ ను చేసి ఎక్కువపాలు పిండుతున్నారు. గడ్డిపై క్రిమికీటకాలు ఆశించకుండా ఉండేందుకు క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. ఈ మందులు వాడిన మేతనే ఆవులకు, గేదెలకు ఇస్తున్నారు. కుడితి నీళ్ళలో కూడా రసాయనాలు వాడుతున్నారు. దీనివల్ల పాలు విషతుల్యంగా మారుతున్నాయి. దీనికి తోడు కృత్రిమంగా తయారుచేస్తున్న పాలపొడితో పాలు తయారుచేసి పసిపిల్లల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. కిలో రూ.60 ఉండే ఈ పాలపొడితో 5 లీటర్ల నకిలీ పాలు తయారుచేస్తున్నారు. ఈ పాలను పూర్తిగా కృత్రిమ రసాయన పదార్ధాలతో తయారుచేస్తున్నారు. వేసవి సమీపిస్తుండడంతో పాల దిగుబడి సహజంగా తగ్గుతుంది. దీనితో ఈ కల్తీరాయుళ్ళు విజృంభించి కల్తీ పాలను, విషతుల్యమైన పాలను మార్కెట్లో సరఫరా చేస్తున్నారు. ఇటువంటి పాలు రాష్ట్రవ్యాప్తంగా అమ్ముతున్నట్లు తెలిసింది. వీటిని అరికట్టకపోతే ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడటం ఖాయం.