TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎమ్మెల్యే భూదాహార్తికి ఆవిరైపోతున్న చెరువులు

Published on: Sat Mar 3, 2012 2:23PM

హైదరాబాద్: ఆయనో ప్రజాప్రతినిధి. హైదరాబాద్ లోని ప్రముఖ ఐటి సంస్థలకు నెలవైన ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఒక పల్లెనుంచి ఆయన చట్టసభకు ఎన్నికయ్యారు. ఆయనకు చేరువులంటే మహాప్రీతి. చెరువులంటే ఇష్టమని ఆయన అక్కడికి వెళ్లి స్నానం చేస్తారానో, కడుపునిండా చల్లని నీళ్ళు తాగుతారానో అనుకుంటే పొరపాటే. ఏదైనా చెరువు కనిపిస్తే దాన్ని కబ్జా చేయడం ఆయనకు మహాఇష్టం. ఇప్పటికే ఆయన దాదాపు ఇదు చెరువులను కబ్జా చేసి బ్రేవ్ మని త్రేన్చుతున్నారు. ఈ కబ్జాలను ప్రశ్నిస్తున్న స్వచ్చంద సేవా సంస్థలను చచ్చిపోతారు జాగ్రత్త అంటూ శపిస్తున్నారు. పేరుకే భిక్షపతి అయినప్పటికీ ఆయన కోట్లకు అధిపతి. ఆయన, ఆయన అనుచరులు చేస్తున్న భూకబ్జాలకు అంతేలేకుండా పోతోంది. గోపన్ పల్లి విలేజ్ నల్లకుంట చెరువును ఆక్రమించుకుని అందులో ఒక పెద్ద ఫాం హౌస్ నిర్మించుకున్నాడు ఈ ప్రజాప్రతినిధి. మదీనాగూడాలోని తిప్పసానిగుంట, ఎర్లచెరువు, మియాపూర్ లోని మత్తామీదికుంట, కొండాపూర్ లోని జంగమోయినకుంట ప్రాంతాలు ఇప్పటికే ఈ కబ్జాకోరు కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. జంట నగరాల్లో చెరువులను పరిరక్షించడానికి ఉద్యమిస్తున్న కొన్ని స్వచ్చంద సంస్థలు ఈ కబ్జాల విషయమై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది తెలుసుకున్న ఆ ప్రజా ప్రతినిధి వారికి మొదట కొంత భిక్షం వేయడానికి ప్రయత్నించారు. అయితే వారు ఆ భిక్షాన్ని తిరస్కరించడంతో మోక్షం కల్పిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో బెమ్బెలేట్టిపోతున్న ఆ బడుగు స్వచ్చంద జీవులు రక్షణ కల్పించాలంటూ పోలీసులను, జిల్లా కలెక్టర్ ను శరణు వేడుకున్నారు. అయినా వారినుంచి వీరికి ఇప్పటిదాకా ఎటువంటి రక్షణ లభించలేదు.