TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆదిలాబాద్ స్కోర్ - రెడ్లు-6, మున్నూరు కాపులు-3, బ్రాహ్మణులు-2, వెలమ-1, మైనార్టీ-1

Published on: Sat Mar 3, 2012 1:34PM

ఆదిలాబాద్: ఆదిలాబాద్ నియోజకవర్గానికి త్వరలో జరుగునున్న ఉప ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఈ నియోజకవర్గ చరిత్ర ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ అగ్రవర్ణాలే ఎక్కువసార్లు గెలిచినట్లు తెలుస్తుంది. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడగా ఇప్పటి వరకు 13 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రెండ్లు 6 సార్లు, మున్నూరుకాపులు 3 సార్లు, బ్రాహ్మణులు 2 సార్లు, వెలమ, మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధులు ఒక్కోసారి గెలుపొందారు.

 

ప్రస్తుత ఎన్నికల్లో ఇక్కడ గెలవడానికి తెలంగాణా సెంటిమెంటే తమకు కలిసివచ్చే పరిణామమని తెలంగాణా రాష్ట్ర సమితి ఆశిస్తోంది. దీనికి తోడు తెలంగాణా ఐక్యకార్యాచరణ సమితి కూడా టిఆర్ ఎస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. సిపిఐ కూడా టిఆర్ ఎస్ కు మద్దతు ప్రకటించింది. బిజెపి అభ్యర్ధి పోటీలో లేకపోవడంతో ఆ పార్టీకి చెందిన ఓట్లు కూడా తమ పార్టీ అభ్యర్ధి జోగు రామన్నకు  వస్తాయని తెరాస భావిస్తోంది. కాంగ్రెస్ విషయానికొస్తే తమ పార్టీ విధానాన్ని ప్రజలకు వివరిస్తూనే గత ఎనిమిదేళ్ళుగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం చేసిన కృషిని వివరించాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. అంతేకాక మండలానికో మంత్రిని ఇన్ చార్జి గా నియమించి పార్టీ అభ్యర్ధి విజయానికి కృషి చేస్తున్నారి. అయితే పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తి కాంగ్రెస్ కు శాపంగా మారే ప్రమాదం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి సిఆర్ఆర్ గెలిస్తే మంత్రి పదవి ఇస్తామన్న ఇన్ చార్గ్జి మంత్రి బసవరాజు సారయ్య చేసిన ప్రకటన జిల్లాలోని కాంగ్రెస్ నేతలకు ఇబ్బంది కలిగించింది. ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ఈ నేపధ్యంలో సిఆర్ఆర్ గెలిస్తే తమకు మంత్రి పదవి రాకుండా పోతుందనే భయంతో ఆయన ఓటమికి పరోక్షంగా ప్రయత్నించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక టిడిపి అభ్యర్ధి పాయల్ శంకర్ విషయానికి వస్తే ఆయన సరికొత్త వాగ్దానాలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తాను గెలిస్తే నియోజకవర్గ ఓటర్లను ఒక్క రూపాయికే 20 లీటర్ల మంచినీటిని అందజేస్తామని, ఎమ్మల్యే క్వార్టర్ కూడా నియోజకవర్గ ప్రజలకే ఇచ్చేస్తామని ప్రకటించారు. అంతేకాక తెలంగాణను అడ్డుపెట్టుకుని తెరాస, కాంగ్రెస్ నేతలు కోట్లాది రూపాయలు దండుకున్నారంటూ ప్రచారం చేస్తున్నారు.

గత ఫలితాలు

 ఈ నియోజకవర్గంలో 1952లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన డి.శంకరరావు పిడిఎఫ్ అభ్యర్ధిగా పోటీచేసి 11 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1957లో వెలమ కులానికి చెందిన రంగనాధరావు పిడిఎఫ్ అభ్యర్ధిగా పోటీచేసి  340 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1962లో జరిగిన ఎన్నిల్లో విఠల్ రావు దేశ్ పాండే స్వాతంత్ర్య అభ్యర్ధిగా పోటీచేసి  1,047 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1967 ఎన్నికల్లో మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన కె. రామకృష్ణు సిపిఐ అభ్యర్ధిగా పోటీచేసి  1,154 ఓట్ల తేడాతో గెలుపొందారు.1972లో ముస్లిం మైనారిటీవర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్ధి మసూద్ అహ్మద్ 20,106 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1978లో రెడ్డి సామాజికవర్గానికి చెందిన సి.రామచంద్రారెడ్డి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి  8,592 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1989లో కూడా ఆయన  10,482ఓట్ల తేడాతో గెలుపొందారు. 1994లో టిడిపికి చెందిన రామన్ రెడ్డి  5,274 ఓట్ల మెజారిటితోనూ, 1999లో మున్నూరు కపుసమజికవర్గానికి చెందిన పరాల భూమన్న  35,226 ఓట్ల తేడాతోనూ, 2004 ఎన్నికల్లో సి. రామచంద్రారెడ్డి  19,837 ఓట్ల తేడాతోనూ, 2009 ఎన్నికల్లో మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన జోగు రామన్న  25,580 ఓట్ల మెజారిటీతోనూ గెలుపొందారు.