త్రిశంకు స్వర్గంలో మాకినేని
Published on: Mon Feb 27, 2012 3:20PM
హైద
రాబాద్: రాజకీయాల్లో హత్యలు ఉండవు, అన్నీ ఆత్మహత్యలే అనే నానుడికి అతికినట్టుగా సరిపోతుంది సేనియర్ నేత మాకినేని పెదరత్తయ్య తాజా పరిస్థితి. తెలుగుదేశంపార్టీలో తిరుగులేని నేతగా ఓ వెలుగు వెలిగి అ పార్టీ రాజకీయాలను శాసించిన మాకినేని రాజకీయంగా వేసిన తప్పటడుగులు కారణంగా ప్రస్తుతం ముందు గొయ్యి వెనుక నుయ్యిలా తయారైంది ఆయన భవిష్యత్తు. సుదీర్ఘకాలం పనిచేసిన తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత కల్పించలేదంటూ దాదాపు ఏడాదిక్రితం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన మాకినేని కొంతకాలం మౌనంగా ఉండి తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గూటికి చేరారు. ఆయన అక్కడ కూడా ఇమడలేకపోయారు. తన రాజకీయ శత్రువైన రావి వెంకటరమణకు పార్టీలో అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని రత్తయ్య సహించలేకపోయారు. దీంతో రత్తయ్య జగన్ పార్టీ కార్యకలాపాలకు కొంతకాలంగా దూరంగా ఉంటూ వచ్చారు. అంబటి రాంబాబు తన శిష్యుడైన జంగా కృష్ణమూర్తి వంటివారు పలుమార్లు రత్తయ్యతో చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్నారు. అయితే అ పార్టీ హైకమాండ్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించలేదు. తెలుగుదేశం పార్టీలోని అంతర్గత రాజకీయాలు రత్తయ్య ఆగమనానికి అడ్డుగోడలుగా నిలిచాయి. రత్తయ్య తిరిగి పార్టీలోకి వస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందన్న భయం కూడా కొందరు టిడిపి పెద్దల్లో ఉంది. ఈ కారణంగా రత్తయ్య రాకను వారు త్రీవంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో రెండింటికీ చెడ్డ రేవడిలా మారింది రత్తయ్య పరిస్థితి.


