సంక్షోభంలో గ్రానైట్ పరిశ్రమ
Published on: Fri Feb 24, 2012 2:29PM
హైదరా
బాద్: ప్రపంచంలో పేరెన్నిక గల నీలిరంగు గ్రానైట్ కు కష్టాలొచ్చాయి.ఆర్ధిక మాంద్యం ప్రభావం, చైనా బయ్యర్లు, యూరోపియన్ దేశాలు కొనుగోలుకు దూరం కావడంతో ఎక్కడి గ్రానైట్ బ్లాకులు అక్కడే క్వారీలో నిలిచిపోయాయి. ఫలితంగా గ్రానైట్ క్వారీల యజమానులు తలలు పట్టుకుంటున్నారు.భారీగా పెట్టుబడులు పెట్టలేని గ్రానైట్ యజమానులు లిమిటెడ్ కంపెనీలు సైతం కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్లకు అరకొర ధరలకే అమ్మకాలు జరుపుతున్నారు. ఒక క్యూబిక్ మీటర్ గ్రానైట్ బ్లాకు తీయాలంటే రూ.18 నుంచి రూ.20వేలు ఖర్చవుతుంది. అయితే దానిని రూ.14 నుంచి రూ.17వేలకే విక్రయించుకోవలసిన దుస్థితి ఏర్పడింది. ఒకపక్క ఎగుమతులు లేక మరొపక్క ధరలు పడిపోవడంతో క్వారీలు నడిపించాలా, ఆపేయాలా తేల్చుకోలేక పలు చిన్న చిన్న గ్రానైట్ కంపెనీల యజమానులు ఆలోచనలో పడ్డారు. దీనికితోడు ఇంధన ధరలు, క్వారీ పనులు నిర్వహించే ప్రొక్లెన్లు, కంప్రెషర్లు, టిప్పర్లు, డంపర్లు, జాకీల ధరలు పెరగడం, కూలీల కొరత ఏర్పడటం, పేలుడు సామాగ్రి ధరలు పెరగడం, వైర్ సా కటింగ్ పరికరాల ధరలు పెరగడంతో అన్నిరకాలుగా గ్రానైట్ పరిశ్రమ కష్టాలకు ఎదుర్కొంటుంది.


