TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మళ్లీ అదే రగడ ...సభ రేపటికి వాయిదా

Published on: Tue Feb 21, 2012 1:42PM

హైదరాబాద్‌ : వారం రోజులగా అసెంబ్లీ సమావేశాల్లో అదే రగడ. పట్టువదలని విక్రమార్కులుగా ప్రతిపక్షాలు, పట్టువీడని ప్రభుత్వం, వెరసి, అసెంబ్లీ సమావేశాలు రోజూ వాయిదా పడుతూనే వస్తున్నాయి. మద్యం సిండికేట్లపై చర్చకు టీడీపీ మంకుపట్టు, తెలంగాణపై తీర్మానం కోసం టీఆర్‌ఎస్‌, బీజేపీల గట్టిపట్టు వెరసి సభలో గందరగోళం చెలరేగుతోంది. ఈరోజు కూడా అసెంబ్లీ ఆరంభం కాగానే రగడ మొదలైంది. మద్యం సిండికేట్లపై చర్చ చేయాలని టీడీపీ, తెలంగాణపై తీర్మానం చేయాలని టీఆర్‌ఎస్‌, బీజేపీ, తెలంగాణ అంశం చర్చించాలని సీపీఐలు పట్టుబట్టడంతో ఏ తీర్మానంపై చర్చించకుండానే అసెంబ్లీ సమావేశం రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయించారు.

వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే ఎంఐఎం, టీఆర్ఎస్ సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టాయి. మైనార్టీ యువకులపై పోలీసుల వేధింపులపై చర్చించాలని ఎంఐఎం, తెలంగాణపై తీర్మానం చేయలంటూ టీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలుపుతూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. చర్చకు అవకాశం ఇస్తామని స్పీకర్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. విపక్షాలు తమ పట్టు వీడకపోవటంతో స్పీకర్ సమావేశాలను బుధవారానికి వాయిదా వేశారు. మూడు రోజుల విరామం అనంతరం కూడా సభలో ఎలాంటి చర్చ జరగకుండానే అసెంబ్లీ వాయిదా పడింది. కాగా, సభ రోజూ వాయిదా పడడంపై సీపీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. సభను అడ్డుకునే వారిని బహిష్కరించి సభ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది.



శాసనసభ వాయిదాలపై చర్చించేందుకు శాసనసభలో పలు పార్టీల ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. టీడీపీ, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఎలాంటి కార్యక్రమాలు జరగకుండా అసెంబ్లీవాయిదా పడుతుండడంపై వీరు చర్చించారు. పంతాలు, పట్టింపులతో సభా సమయంతో పాటు ప్రజా ధనం వృధా అవుతోందని సీపీఎం ఆందోళన వ్యక్తం చేసింది.