హంద్రీ-నీవాకు నిధుల గండం
Published on: Sat Feb 18, 2012 4:15PM
హైదరాబాద్: లక్షలాది మంది కరువు పీడిత రైతులకు వరప్రసాదినిగా భావించిన హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు నిధుల కొరత ఏర్పడింది. గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్టుకు అరకొర నిధులే కేటాయించారు. తాజాగా ఈ బడ్జెట్ లో రూ.1,637కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం కేవలం రూ.695 కోట్లు మాత్రమే కేటాయించింది. కర్నూలు,అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో జరుగుతున్న రెండు దశల పనులకు ఈ నిధులు ఇచ్చారు. తొలిదశ పనులు పూర్తి కావచ్చాయి. రెండో దశ పనులు 2013 జూన్ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. తాజాగా చేసిన అరకొర కేటాయింపులతో గడువులోగా పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఇప్పట్లో ఈ పనులు పూర్తయ్యే అవకాశంలేదని ఇరిగేషన్ శాఖ నిపుణులు అంటున్నారు.


