సభాసంఘం పై రాజకీయ దుమారం..రద్దుకు మొగ్గు?
Published on: Wed Feb 15, 2012 10:35AM
హైదరా
బాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై వేసిన సభా సంఘాన్ని రద్దు చేయాలని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సభా సంఘం ఏర్పాటుపై రాజకీయ దుమారం చెలరేగడంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సభా సంఘం విధివిధానాలపై స్పష్టత లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యురాలు వైయస్ విజయమ్మ స్పీకర్కు లేఖ రాశారు. అంతేకాకుండా ఎమ్మెల్సీలకు ఆ సంఘంలో ప్రాతినిధ్యం లేకపోవడంపై కూడా ఆమె ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో సహా ఇతర పార్టీ నాయకులు కూడా సభా సంఘం సభ్యుల శాతంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సభా సంఘంలో తమ పార్టీకి చెందినవారిని తగినంత మందిని నియమించలేదని చంద్రబాబు విమర్సించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపుల విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు క్లీన్ చిట్ ఇవ్వడానికే తమ పార్టీకి తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని, సభలోని సంఖ్యా బలానికి అనుగుణంగా సంఘంలో ప్రాతినిధ్యం కల్పించలేదని తెలుగుదేశం నాయకులు విమర్సించారు. ఈ స్థితిలో సభా సంఘాన్ని రద్దు చేసి, ఎమ్మెల్సీలకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తూ జాయింట్ కమిటీని వేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.


