అసెంబ్లీలో గందరగోళం..వాయిదాల పర్వం
Published on: Tue Feb 14, 2012 9:46AM
హై
దరాబాద్ : అసెంబ్లీలో మంగళవారం వాయిదాల పర్వం కొనసాగింది. శాసనసభలో మంగళవారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. తెలంగాణపై తీర్మానం చేయాలని టీఆర్ఎస్, బేజేపీ, మద్యం సిండికేట్లు, ఏసీబీ నివేదిక, మంత్రి బంధువుల ప్రమేయంపై టీడీపీ, జూనియర్ డాక్టర్ల సమ్మె, రోగుల ఇక్కట్లుపై సీపీఎం, సీపీఐలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. అయితే సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దాంతో టీడీపీ, టీఆర్ఎస్ సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చ జరపాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఫ్లకార్డులతో విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం ఎదుట నిరసనకు దిగారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు.
కాగా, అరగంట వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం అయినా విపక్షాలు తమ పట్టువీడలేదు. సభా కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో స్పీకర్ సమావేశాల్ని మరో 15 నిమిషాలు పాటు వాయిదా వేశారు. రెండుసార్లు వాయిదా పడుతూ వచ్చిన శాసనసభ విపక్షాల నిరసనల మధ్య రేపటికి వాయిదా పడింది. మద్యం సిండికేట్లపై టీడీపీ, తెలంగాణపై తీర్మానం చేయాలంటూ టీఆర్ఎస్ సభ్యలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి తమ నిరసన తెలిపారు. దాంతో అసెంబ్లీలో తొలిరోజు ఎలాంటి అంశాలు చర్చకు రాకుండానే బుధవారానికి వాయిదా పడింది.


