జగన్ పై విజయమ్మకు రేవంత్ రెడ్డి సూచన
Published on: Sun Feb 12, 2012 3:07PM
హైదరా
బాద్: జగన్కు శిక్ష తగ్గాలంటే విజయమ్మ తన తనయుడిని పోలీసులకు వెంటనే అప్పగించాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మకు ఆదివారం సూచన చేశారు. తల్లిగా జగన్ చేస్తున్న తప్పులను ఆమె సరిదిద్దాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని భూకేటాయింపుల పైన వేసిన సభా సంఘం విషయంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ పైన ఆయన మండిపడ్డారు. స్పీకర్ తీరు చూస్తుంటే వైయస్, జగన్కు క్లీన్ చిట్ ఇచ్చేందుకే సభా సంఘం వేసినట్లుగా ఉందన్నారు. భూకేటాయింపుల సంఘం వేసిన తీరు సరిగా లేదని అందుకే దాని నుండి వైదొలగాలని తమ పార్టీ నిర్ణయించుకుందని మరో నేత మోత్కుపల్లి నర్సింహులు వేరుగా చెప్పారు. స్పీకర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ వైఖరికి నిరసనగా తాము బిఏసి సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని అన్నారు. సోమవారం సమావేశాలకు ఎన్టీఆర్ ఘాట్ నుండి అసెంబ్లీ వరకు పాదయాత్రగా వెళతామని చెప్పారు.


