యువతకు రాజకీయనాయకుల గాలం
Published on: Sun Feb 12, 2012 1:59PM
హై
దరాబాద్: రాజకీయనాయకులు యువతకు గాలం వేసే పనిలో బిజీ బిజీ గా గడుపుతున్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల వారు యువమంత్రం జపిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి యువతను బుట్టలో వేసుకోవడానికి రాజీవ్ యువకిరణాలు ప్రవేశపెడితే, జగన్ ఫీజు పోరు పేరిట హైదరాబాదులో దీక్ష చేయడంతో యూత్ పైన ఆయన దృష్టి పెరిగినట్లుగా కనిపిస్తోంది. ఆయన ఓదార్పు యాత్రలో కూడా యువతే ఎక్కువగా కనపడుతుంది. యూత్కు యువకుడైన తమ పార్టీ అధినేతే ఐకాన్ అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెసు వైపు యువతను మళ్లించేందుకు ముఖ్యమంత్రి రాజీవ్ యువకిరణాలు పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకం ఇప్పటికే యువత నోళ్లలో జోరుగా నానుతోంది. ఈ పథకం పట్ల యువత కూడా అంతో ఇంత అనుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో సిఎం ప్రవేశ పెట్టిన ఈ పథకం లక్ష్యం కొంతలో కొంతైనా నెరవేరిందనే చెప్పవచ్చు. ఇక కిరణ్, జగన్ కంటే కూడా చంద్రబాబు జోరుగా యువత వైపు దూసుకు పోతున్నారు. యువతరంగం పేరిట ప్రధాన పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తన పాలనలో యువత కోసం చేపట్టిన కార్యక్రమాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. యువతకు హామీలు గుప్పిస్తున్నారు. ఇన్నాళ్లూ రైతుల పేరు జపించిన మన నేతలు ఇప్పుడు యువత మంత్రం జపించడం వెనుక ఓ కారణముందంటున్నారు. సాధారణంగా రైతులు తాము ఏ పార్టీకి ఫిక్స్ అయిపోతే అదే పార్టీకి ఓటేస్తారు. కానీ యువత మాత్రం ఎప్పుడూ మార్పు కోరుకుంటుంది.


