సభా సంఘం..వైఎస్సార్ పై మరో కుట్ర:కొణతాల
Published on: Sun Feb 12, 2012 10:01AM
హైదరా
బాద్: విచారణాంశాలు స్పష్టంగా పేర్కొనకుండా భూకేటాయింపులపై సభా సంఘం ఏర్పాటు చేయడమంటే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ఈ ప్రభుత్వం మరో కుట్ర పన్నుతోందని అర్థమవుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. టిడిపి నాయకులు కేవలం 2004-2009 మధ్య కాలంలో జరిగిన భూకేటాయింపులపై సభా సంఘం వేయాలని పట్టుబడితే మిగిలిన అన్ని పక్షాలతో పాటు కాంగ్రెసు, వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు 1994 నుండి జరిగిన అన్ని రకాల కేటాయింపులపై సభా సంఘం వేయాలని డిమాండ్ చేశారని, అయితే మొత్తం భూకేటాయింపులపై సభా సంఘం వేస్తే పెట్టుబడిదారుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనడంతో ఆయన మైండ్ సెట్ ఏమిటో తెలిసిపోయిందని అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అమీర్‌పేట భూకేటాయింపుల వివాదాన్ని సభా సంఘం పరిధిలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. సభా సంఘం అంటే నిర్దిష్టమైన ఎజెండాతో సభా సంఘాన్ని నియమించి, ఆ అంశాలపై దర్యాఫ్తు చేయాలని ఆదేశించడమని, కానీ ఈ సభా సంఘం మాత్రం కేవలం వైయస్సార్, తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని కుట్రతో జరుగుతున్నట్లుగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.


