TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జాతీయ హోదా కు రూట్ క్లియర్

Published on: Fri Feb 10, 2012 10:12AM

హైదరాబాద్: రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించే అంశం కొలిక్కివచ్చినట్టు తెలుస్తోంది. రెండు నెలల్లోగా పథకాన్ని జాతీయ పథకంగా గుర్తించనున్నట్టు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు అందినట్టు సమాచారం. పోలవరం పథకానికి ఇప్పటికే అన్ని అనుమతులు వచ్చాయి. పక్క రాష్ట్ర అభ్యంతరాలు తప్పిస్తే ఇతర సమస్యలు పోలవరానికి లేవు. ఈ పథకానికి జాతీయ హోదా కల్పించాలని గతం నుంచి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంది. అయితే రాష్ట్రంలో నెలకొన్న ప్రాంతీయ ఉద్యమాలు, ఏడాదికి ఒక రాష్ట్రంలో ఒక పథకానికే జాతీయ హోదా కల్పించాలన్న కేంద్ర ఆలోచన వంటి అంశాలు పోలవరానికి జాతీయ హోదా గుర్తింపు ఇవ్వడంలో జాప్యానికి కారణమయ్యాయి. ఇటీవల ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో నీటి పథకాలకు జాతీయ హోదా ప్రకటించడం వల్ల ఇప్పుడు పోలవరానికి కూడా జాతీయ హోదా ఇచ్చే ప్రక్రియ వేగవంతమైనట్టు సమాచారం. గరిష్టంగా రెండు నెలల కాలంలోగా పథకానికి జాతీయ హోదా ఇవ్వనున్నట్టు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు అందాయని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో జాతీయ హోదా ప్రకటనపై నిర్ణయం తీసుకునే అవకాశాలూ ఉన్నాయని ఆ అధికారి చెప్పారు. ఇలావుండగా, పోలవరానికి జాతీయ హోదా ప్రకటిస్తే తెలంగాణలో ఆందోళన రాకుండా ప్రాణహిత- చేవెళ్ల పథకంపైనా దృష్టి పెట్టాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఎటువంటి అనుమతులు ప్రాణహిత- చేవెళ్ల పథకానికి లేకపోయినప్పటికీ, జాతీయ హోదా ఇవ్వటంపై సూత్రప్రాయంగా ఒక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.