TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేడు డీఎల్ 'కీలక'నిర్ణయం..రాజీనామా చేస్తారా!?

Published on: Wed Feb 8, 2012 9:07AM

హైదరాబాద్ : మంత్రివర్గ విస్తరణ సందర్భంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన శాఖకు కోత విధించడంపై మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తన శాఖ కత్తిరింపుపై తీవ్ర ఆగ్రహంతోవున్న మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మాత్రం భవిష్యత్ కార్యక్రమాన్ని బుధవారం ప్రకటిస్తానని చెప్తున్నారు. ముందుగా ఢిల్లీకి వెళ్లి అక్కడ పార్టీ ముఖ్యులను కలిసి వారితో చర్చించాకే తుది నిర్ణయానికి రావాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, సిఎం కిరణ్ వైఖరిపట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న డిఎల్, మంత్రి పదవికి రాజీనామా చేయవచ్చని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.


కాగా, భారం మోయలేననో... లేక రాబోయే ఉప ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొనో సీఎం కిరణ్ తనశాఖను కుదించి యువతకు ఇచ్చి ఉండవచ్చని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. శాఖ కుదింపుపైతాను సీఎంను అభినందిస్తున్నానన్నారు. కడపజిల్లా ఖాజీపేటలోని తన స్వగృహంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. "ప్రభుత్వ పథకాలపై దాదాపు రూ.80 వేలకోట్లు ఖర్చు పెడుతున్నాం. వాటిని సమీక్షించుకోవాలి. లోటుపాట్లను ఎత్తి చూపినందుకు శాఖను కుదించి ఉంటారని అనుకోను. కేబినెట్‌లో ఉన్నా లేకపోయినా లోటుపాట్లపై ఎవరికీ భయపడకుండా మాట్లాడతాను'' అని స్పష్టంచేశారు. రాజ్యాంగం ప్రకారం శాఖల మార్పులు, కుదింపులు ముఖ్యమంత్రి పరిధిలో ఉంటాయని, తాను ఏ శాఖలో ఉన్నా ఉన్న విషయాన్ని నిర్భయంగా, ముక్కుసూటిగా మాట్లాడతానని, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులకు కొమ్ముకాయనని స్పష్టం చేశారు. సీఎం కిరణ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, విధానపరంగా కొన్ని పథకాలపై భేదాభిప్రాయాలు ఉండవచ్చని వ్యాఖ్యానించారు.