TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిజం ఒప్పుకున్న బొత్స..ఐఏఎస్ లపై ఫైర్

Published on: Tue Feb 7, 2012 1:47PM

హైదరాబాద్:  కేబినెట్ విస్తరణతో ఆశావహుల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అంగీకరించారు. వారితో సీఎం మాట్లాడతారని ఆయన చెప్పారు. అసంతృప్తుల ఆవేదనను పార్టీ అర్థం చేసుకుందని చెప్పారు. వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామని చెప్పారు. శాఖల మార్పుల పైన సిఎం ఆలోచిస్తున్నారని చెప్పారు. శాఖల మార్పుతో మంత్రులలో ఎలాంటి అసంతృప్తి లేదని.. ప్రజా ప్రయోజనం కోసమే మార్చాల్సి వచ్చిందన్నారు. మంత్రి డిఎల్ అసంతృప్తి తనకు తెలియదన్నారు. ఉప ఎన్నికలకు సమాయత్తమవుతున్నామని..సమిష్టి కృషితో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం అందరం కలిసి కృషి చేస్తామని చెప్పారు.

ఐఏఎస్ లపై కూడా బొత్స ఫైరయ్యారు. మంత్రులపై ఎవరూ లేని పోని ఆరోపణలు చేయవద్దని ఆయన ఐఏఎస్ అధికారులకు సూచించారు. అంశాల వారీగా పేర్కొని అక్రమాలకు బాధ్యులెవరో చెప్పాలన్నారు. మంత్రులపై విమర్శలు చేస్తున్న అధికారులు ఏ మంత్రి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విధాన నిర్ణయాలకు కేబినెట్ తప్పకుండా బాధ్యత వహిస్తుందని చెప్పారు. అయితే తెరవెనుక జరిగే వాటితో కేబినెట్‌కు సంబంధం లేదన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో అత్యధికంగా బలహీనవర్గాలు, దళితులకు చోటు కల్పించినట్లు చెప్పారు. రాబోయే కాలంలో తెలంగాణకు రావాల్సిన ప్రాతినిథ్యం పూర్తి చేయనున్నట్లు చెప్పారు. చిరంజీవికి సీఎల్పీ ఉపనాయకుని పదవి ఇవ్వడం సముచితమైనదే అన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు.