TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం గా ప్రతిపక్ష నేతగా నాదే రికార్డ్:చంద్రబాబు

Published on: Sun Jan 29, 2012 8:37AM

హైదరాబాద్: ముఖ్యమంత్రిగానే కాదు ప్రతిపక్ష నేతగానూ నాదే రికార్డు అని టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు సగర్వంగా ప్రకటించుకున్నారు. 'నాకు సీఎం పదవి కొత్త కాదు. దానిపై కోరికా లేదు. రాష్ట్రంలో అత్యధికంగా తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నది నేనే. మరో ఎనిమిదేళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉంటున్నాను. నా రికార్డును మరో ఇరవై ఏళ్ల వరకూ ఎవరూ బ్రేక్ చేయలేరు''అని బాబు ప్రకటించుకున్నారు. టిడిపి సాంకేతిక నిపుణుల విభాగం రాష్ట్ర కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం శనివారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు తన రికార్డును వివరించారు. చంద్రబాబు నాయుడు దాదాపు తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అంతకు ముందు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన కాసు బ్రహ్మానందరెడ్డి రికార్డును బాబు బ్రేక్ చేశారు. 2004 ఎన్నికల్లో ఓటమి తరువాత దాదాపు ఎనిమిదేళ్ల నుంచి చంద్రబాబు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. గతంలో ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చెరో ఐదేళ్ల పాటు మాత్రమే ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతలు నిర్వహించారు. బాబు ఈ రికార్డును కూడా బద్దలు కొట్టి రెండవ సారి కూడా ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతలు చేపట్టారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా ఉందని, ఈ పాలనను చూస్తుంటే ఆవేశం కలుగుతోందని చంద్రబాబు అన్నారు. టిడిపి తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేశానని, విదేశీ పెట్టుబడుల కోసం కాళ్లు అరిగేలా తిరిగానని అన్నారు. తాను సాధించిన అభివృద్ధిని వైఎస్‌ఆర్ అధికారంలోకి వచ్చాక సర్వనాశనం చేశారని, రాష్ట్రాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి నెట్టివేశారని విమర్శించారు. నేరుగా పేరు ప్రస్తావించకపోయినా కాంగ్రెస్ ముఖ్యనేత చిరంజీవికి దీటైన సమాధానం అన్నట్టుగానే ప్రసంగం సాగించారు. "ముఖ్యమంత్రి పదవి లేక నాకు అసహనం పెరుగుతోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. నాకు అలాంటి అసహనాలేమీ లేవు. గతంలో ఏ సీఎం పట్టించుకోని విద్యుత్ రంగాన్ని సంస్కరణల బాట పట్టించానని చెప్పారు. వ్యవసాయం లాభసాటి చేయడమే ఇప్పుడు తన ముందున్న ప్రధాన ధ్యేయమని తెలిపారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ద్వారా సాంకేతిక నిపుణలు తమ ఆలోచనలు పంచుకోవాలని కోరారు. అందరి సలహాలు తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి తగు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో 50శాతం యువత ఉందని, వారికి సరైన విద్యను అందిస్తే అద్భుతాలు చేస్తారని అన్నారు. ముఖ్యమంత్రి పదవి లేదని తనకు వ్యక్తిగతంగా ఆవేదన లేదని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నాననే ఆవేదన చెందుతున్నానని అన్నారు.

కాగా, తన జీవితంలో ఇప్పటి వరకు ఒక్క చుక్క కూడా మద్యం ముట్టలేదని  చంద్రబాబు చెప్పుకొచ్చారు. మద్యం సిండికేట్లపై మండిపడిన చంద్రబాబు, ఒకటో రెండో పెగ్గులు తాగితే నష్టం లేదని, అదే కిక్కు ఎక్కువైతే జీవితం సర్వనాశనమవుతుందని గుర్తు చేశారు. పేదల జీవితాలను మద్యం సిండికేట్లు నాశనం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సిండికేట్లకు వ్యతిరేకంగా గాంధీ వర్ధంతి రోజున రెవెన్యూ డివిజన్ల స్థాయిలో తమ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.