విగ్రహాల ధ్వంసంలో వీడని మిస్టరీ
Published on: Sat Jan 28, 2012 10:20AM
హై
దరాబాద్: అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. కేసు విచారణ పోలీసులకు సవాలుగా మారుతోంది. రోజులు గడుస్తున్నా నిందితుల ఆచూకి లభించకపోవడంతో దళిత సంఘాలు ఫైరవుతున్నాయి. ఇక ప్రభుత్వం తరపున పర్యటించిన మంత్రులు పరామర్శలు, ఓదార్పుతోనే కాలం గడిపారు. అంబేద్కర్ విగ్రహాల ధ్వంసంతో అట్టుడికిన కోనసీమ క్రమంగా కుదుటపడుతోంది. దళిత సంఘాల ఆందోళనలతో దద్దరిల్లిన అమలాపురంలో ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంటోంది. మంత్రుల బృందం పరామర్శలు, ఓదార్పుతోనే కాలం గడిపింది. ధ్వంసమైన విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్టిస్తామని, అసెంబ్లీలోనూ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు నేతలు హామీ ఇచ్చారు. ప్రజలంతా సంయమనంతో వ్యవహరించాలని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క సూచించారు. అయితే మంత్రుల టూర్ పై స్థానిక దళిత సంఘాలు పెదవి విరుస్తున్నాయి. విగ్రహాల ధ్వంసం జరిగి రోజులు గడుస్తున్నా కేసును చేధించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. పరామర్శలు, హామీలు కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


