వ్యాట్ రద్దు ప్రసక్తే లేదు తేల్చి చెప్పిన సీఎం
Published on: Sat Jan 28, 2012 9:20AM
హైదరా
బాద్: వస్త్ర వ్యాపారంపై విధించిన విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను ఉపసంహరించుకునే ప్రసక్తిలేదని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యాట్ రద్దు కోరుతూ వ్యాపారుల సంఘం ఈనెల 23నుంచి రాష్టవ్య్రాప్తంగా ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. నెలాఖరు వరకు వస్త్ర వ్యాపార సంస్థలను మూసివేస్తున్నట్టు వారు ప్రకటించారు. ఈమేరకు రాష్ట్రంలో వస్త్ర వ్యాపారులు దుకాణాలను మూసి వేసి ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో వస్త్ర వ్యాపారుల సంఘం ప్రతినిధులు శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని సిఎం క్యాంపు కార్యాలయంలో కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వస్త్రాలపై వ్యాట్ విషయంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. ఐదు లక్షల రూపాయల వరకు టర్నోవర్ కలిగిన వ్యాపారంపై ఎటువంటి పన్ను విధించడం లేదన్నారు. 40 లక్షల రూపాయల వరకు కేవలం ఒక శాతం మాత్రమే పన్ను విధిస్తున్నట్టు చెప్పారు. పది కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న వ్యాపారిపై కూడా పన్ను విధించరాదంటూ ఆందోళన చేయడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, దీనికి నిధులు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించారు. పన్నుల వసూళ్ల విషయంలో ఎవరినీ వేధించమన్నారు. వర్తకులను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయరాదని సంబంధింత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. మరమగ్గాలు, చేనేత వస్త్రాలు, జరీ వస్త్రాలపై ఎటువంటి పన్ను విధించడం లేదన్నారు. ఇదిలాఉండగా, వస్త్ర వ్యాపారులు చేపట్టిన ఉద్యమాన్ని ఉపసంహరించు కోవాల్సిందిగా 20 సూత్రాల ఆర్థిక కమిటీ చైర్మన్ తులసిరెడ్డి కోరారు.


