TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇంకా యానాంలో టెన్షన్‌ టెన్షన్‌

Published on: Sat Jan 28, 2012 8:55AM

హైదరాబాద్: ప్రశాంతతకు మారుపేరైన యానాం పోలీసు కాల్పులతో ఒక్కసారి ఉలిక్కిపడింది. రీజెన్సీ సిరామిక్స్‌ ఫ్యాక్టరీ యాజమాన్యానికి, కాంట్రాక్టు ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. చివరికి యాజమాన్యం నిర్లక్ష్యం, పోలీసుల అత్యుత్సాహంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. యానాం రణరంగాన్ని తలపిస్తోంది. రిజెన్సీ సిరామిక్స్‌ ఫ్యాక్టరీలో యూనియన్‌ ఏర్పాటుతో కార్మికులకు, యాజమాన్యానికి మధ్య వివాదానికి కేంద్రబింధువైంది. కార్మిక నేత మురళీమోహన్‌ను ఉద్యోగం నుంచి తప్పుకోవాలని ఆదేశించిన యాజమాన్యం అతనితో సహా మూడు వందల మంది కాంట్రాక్ట్‌ సిబ్బందిని తొలగించింది. కడపు మండిన కార్మికులు కొత్త కాంట్రాక్ట్‌ సిబ్బందిని విధుల్లోకి చేరకుండా కంపెనీ ఎదుట అడ్డుకున్నారు. అయితే రంగంలోకి దిగిన యానాం సిఐ పెరియస్వామి ఇతర పోలీసులు యూనియన్‌ నేత మురళీమోహన్‌ను స్టేషన్‌కు తరలించి చావబాదారు. మురళీ మోహన్‌ చనిపోవడంతో ఆగ్రహించిన కార్మికులు, దళితులు ఫ్యాక్టరీకి నిప్పంటించారు. ఆర్టీసీ , ప్రైవేటు బస్సులపై దాడులు చేసి దగ్ధం చేశారు. పోలీసు కాల్పులు, లాఠీఛార్జ్‌ ఘటనలో పదిమంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని యానాం ప్రభుత్వ ఆసుపత్రికి అటునుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. ఫ్యాక్టరీ వ్యవహారాల వైస్‌ ప్రెసిడెంట్‌ జి.చంద్రశేఖర్‌ ఇంటిపై దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అతని మెదడు బయటికి వచ్చింది. చంద్రశేఖర్‌ ను కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. కార్మిక నేత మురళీమోహన్‌ మృతికి కారకులైన ఎస్ఐ , సిఐలను సస్పెండ్‌ చేసి వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. కాల్పులకు నిరసనగా అన్నా డిఎంకె ప్రధాన కార్యదర్శి శ్రీహరి యానాం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమరణ దీక్షకు దిగారు. యానాం రీజెన్సీ సిరామిక్స్‌లో పోలీసుల లాఠీఛార్జ్‌పై ఆ కంపెనీ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు , ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు. 144 సెక్షన్‌ విధించినప్పటికీ యానాంలో పూర్తి స్థాయిలో పోలీసులు అందుబాటులో లేకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్‌ నెలకొంది.