తాడో పేడో తేల్చుకోనున్న జూడాలు
Published on: Thu Jan 26, 2012 10:16AM
హైదరా
బాద్: న్యాయమైన డిమాండ్ల సాధనకు రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. ప్రభుత్వం ప్రతిసారీ మాట తప్పడంతో, ఈసారీ తాడో పేడో తేల్చుకునేందుకే జూడాలు సిద్ధమయ్యారు. వినూత్న తరహాలో నిరసనలతోపాటు..ఆమరణ దీక్షకు సైతం జూడాలు సిద్ధమయ్యారు. ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన హామీలు గాలికి వదిలేసినట్లు.., తమ డిమాండ్ల పై కూడా పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదంటూ జూనియర్ డాక్టర్లు మండిపడుతున్నారు. గతంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చటంతోపాటు., ఇతరత్రా 11 డిమాండ్లతో వారు మరో సారి ఆందోళన బాటపట్టారు. ప్రతి నెలా తొలివారంలోనే స్టైఫండ్ విడుదల చేయటంతోపాటు., రెండేళ్లకోసారి 15 శాతంగా ఉన్న స్టైఫండ్ పెంపును 40 శాతం చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్. వీటితోపాటు వైద్య కళాశాలల్లో మౌళిక వసతుల కల్పన., విధుల్లో భద్రత కల్పించటం., గ్రామాల్లో తప్పనిసరి సేవల్ని రద్దు చేయటం వంటి ఇతరత్రా 11 డిమాండ్లు ఉన్నాయి. గడిచిన నెలరోజులుగా నిరసనలు తెలుపుతున్నా సానుకూలంగా స్పందించకపోవటంతో..సర్కారు వైఖరిని నిరసిస్తూ గాంధీ ఆస్పత్రిలో జూడాలు ఆమరణ దీక్షకు దిగారు. సమస్యల పరిష్కారానికి లిఖితపూర్వక హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ ఓపి సేవలు ఆగిపోయాయి. అత్యవసర సర్వీసుల్ని సైతం ఆపేసేందుకు జూడాలు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావటంతో..అత్యవసర సేవల్ని సైతం నిలిపేసేందుకు జూడాలు సిద్ధమవుతున్నారు.


