TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మీడియాకు క్లాస్ పీకిన బొత్స

Published on: Fri Jan 20, 2012 2:05PM

హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ బొత్స సత్యనారాయణ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మీడియాకు క్లాస్ పీకారు. నిన్నటి మంత్రివర్గ విస్తరణ సందర్భాన్ని మీడియాలో రకరకాలుగా రాశారనీ, "సత్తిబాబుది పైచేయి.. సీఎంది కింది చేయి" అంటూ రాయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. లేనిపోని అభూత కల్పనలు రాసి గ్యాప్‌ను పెంచవద్దని మనవి చేస్కుంటున్నానన్నారు. తామంతా సోనియా గాంధీగారి నాయకత్వంలో ఉన్నామనీ, కనుక ఒకరిది పైచేయి.. మరొకరిది కింది చేయి కాదని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు. చిరంజీవికి తమ పార్టీ శానససభ్యుడిగా, నాయకుడిగా గౌరవం ఉంటుందని ఆయన అన్నారు. శంకరరావును తాము మంత్రి వర్గం నుంచి గెంటేయలేదని ఆయన అన్నారు. శంకరరావే వెళ్లి పోయే పరిస్థితి తెచ్చుకున్నారని ఆయన అన్నారు. పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలో తమకు తెలుసునని ఆయన అన్నారు. 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని, ముఖ్యమంత్రి నేతృత్వంలోనే ఎన్నికలను ఎదుర్కుంటామని ఆయన చెప్పారు. జోడు పదవుల గురించి ఏ వేదికలోనూ చర్చ జరగలేదని ఆయన చెప్పారు. వర్గాన్ని, ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుని చేస్తారని, వ్యక్తులను పరిగణనలోకి తీసుకుని చేయబోరని ఆయన చెప్పారు. అసంతృప్తిని నివారించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు. మంత్రి వర్గంలో కాపు వర్గానికి చెందినవారు నలుగురే ఉన్నారని ఆయన చెప్పారు. రెవిన్యూ సదస్సులను విజయవంతం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఉన్నదన్నారు. పార్టీని బలోపేతం చేసి 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చే దిశగా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. రేపు గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు.