TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శంకరరావు,డీఎల్ లకు చెక్..గంటా,చంద్రయ్యలకు ఛాన్స్?

Published on: Wed Jan 18, 2012 8:56AM

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీలో వేడిపుట్టిస్తున్నాయి. పీసీసి చీఫ్ బొత్స, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ కలిసి కాకుండా వేర్వేరుగా ఆజాద్‌తో భేటీ కావడంతో మంత్రివర్గ విస్తరణపై  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా పరిస్థితులు కనబడుతున్నాయని, అదేవిధంగా ప్రతి విషయంలోనూ ఆయన ఒంటెద్దు పోకడ పోతున్నారనీ, సహచర మంత్రులను కలుపుకుని వెళ్లడం లేదన్న ఫిర్యాదుల చిట్టాను ఆజాద్ ముందు పెట్టినట్లు సమాచారం. అదే రీతిలో ముఖ్యమంత్రి కిరణ్ సైతం బొత్స వర్గం ప్రభుత్వాన్ని తూర్పారబట్టడమే పనిగా పెట్టుకున్నదనేందుకు ఉన్న ఉదాహరణలతో సైతం వెళ్లినట్లు సమాచారం. ఇదిలావుండగా ప్రజారాజ్యం పార్టీ నుంచి ముందు నుంచీ అనుకున్నట్లుగా గంటా శ్రీనివాసరావుకి, రామచంద్రయ్యకు బెర్తులు దాదాపు ఖరారైనట్లేనని చెపుతున్నారు. ఇకపోతే కిరణ్‌కు పంటి కింద రాయిలా మారిన శంకర్రావును పదవి నుంచి తొలగించడం కూడా ఖాయమైనట్లు సమాచారం. ఇక తెలంగాణ ప్రాంతంలో రాజీనామాలు చేసిన ముగ్గురు మంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కూడా దాదాపు అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద విస్తరణ ఈ నెల 19న లేదా 23న జరగనున్నట్లు సమాచారం.