TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆజాద్ అగాధాన్ని పెంచారు

Published on: Sun Jan 8, 2012 9:10AM

హైదరాబాద్: కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాం నబీ ఆజాద్‌ రెండురోజుల పర్యటన రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని మరింత అగాధంలోకి నెట్టింది. ఇప్పటివరకు ఎన్ని విభేదాలున్నా ఏదో ఒకరకంగా మాట్లాడుకునే నేతలు ఆజాద్‌ పర్యటన అనంతరం వారి మధ్య దూరాన్ని మరింత పెంచింది. రాబోయే రోజుల్లో ఒకరు మరొకరిని నమ్మే పరిస్థితి కూడా ఉండదని తెలుస్తోంది. ఆజాద్‌ తన పర్యటనలో అగ్గిపుల్ల రాజేశారని కాంగ్రెస్‌పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. నేతల మధ్య సమన్వయం ఉంటుందో లేదో కానీ దానివల్ల మరింత అగాధం ఏర్పడుతుందంటున్నారు. అంశాల వారీగా ఈ నెల 21న జరగబోయే సమన్వయ కమిటీలో పరస్పర ఆరోపణలు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

పార్టీ, ప్రభుత్వం మధ్య నెలకొన్న అగాధం పూడ్చడానికి ఎఐసిసి ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీపై కొంతమంది నేతలు విస్మయం చెందుతున్నారు. సమావేశం జరిగిన తీరుపై సిఎల్పీ, గాంధీభవన్‌ల్లో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు చర్చించుకున్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఒకనొకరు తమ వాదనలు సమర్థించుకుంటూ ఆజాద్‌ ఎదుట అరుచుకున్నట్లు వార్తలొచ్చాయి. ఇద్దరు నేతల తీరును ఇతర సభ్యులు ఎండ గడుతూ పార్టీ రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చినట్లు తెలిసింది. తనను పట్టించుకోవడం లేదని డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ సిఎం వైఖరిని తప్పుపట్టినట్లు సమాచారం. ఆజాద్‌ సమక్షంలోనే ముగ్గురు నేతలు ఒకరిపైనొకరు గట్టిగట్టిగా అరచుకున్నట్లు తెలిసింది. నేతలను సముదాయించడానికి ఆజాద్‌ ప్రయత్నించినా వీలు కుదరకే సమావేశాన్ని ఈ నెల 21కు వాయిదా వేసినట్లు తెలిసింది. కిరణ్‌, బొత్సలు తమ మద్దతుదారుల చేత ఆజాద్‌కు లేఖలు ఇప్పించినట్లు తెలిసింది. మంత్రుల సహా ఎక్కువమంది సిఎంపై ఎక్కువ ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. సిఎంపై ఫిర్యాదుల విషయంలో అందరూ కలిసిపోయారని, మరోసారి సమావేశంలో వారిపై ఫిర్యాదులు ఇప్పించాలని సిఎం వర్గీయులు చూస్తున్నట్లు తెలిసింది. సమన్వయం కాస్త నేతల మధ్య మరింత అభిప్రాయబేధాలను తీవ్రతరం చేసిందని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. సమన్వయం కుదర్చడానికి వచ్చిన ఆజాద్‌ దానిపై దృష్టి పెట్టకుండా ఫిర్యాదులను ఆహ్వానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి, ఉపఎన్నికల్లో ఏరకంగా వెళ్ళాలి, నామినేటెడ్‌ పదవుల భర్తీపై తేల్చకుండా సమన్వయము ఏ రకంగా కుదురుతుందని అంటున్నారు. తెలంగాణా అంశం లాగా పార్టీ విషయాలను తేల్చకుండా పోతే పార్టీకే నష్టమంటున్నారు.